1)
పుల్ల పుల్లను
విరిచి తెచ్చి
కట్టుకుంది గూడు
గుడ్లు పెట్టాలని
పిల్లలు ఎగిరిపోతాయి
నిష్టుర సత్యం
……………………….
2)
తనకు తానె
వెలికి వచ్చును
గ్రుడ్డు తొలుచుక
పక్షి పిల్ల
వెలికి రావాలని
ఆ జీవికెవరు నేర్పారు
…………………………….
3)
పుల్ల పుల్లను
తెచ్చి
గూడు కట్టి
గుడ్లు పెట్టి
తనకు తెలుసా
పిల్లలు ఎగిరి పోతాయని?
4)
ఆహారంతో
ఇల్లుచేరింది పక్షి
నోళ్ళు తెరిచింది
గూడు
పిల్లలికి
పాపం ఆకలి !
……………………………………..
5)
పిల్లలు కోపంతో
వెదజల్లిన రంగులు
అద్భుతంగా
ఓ వర్ణ చిత్రం
ఆపాదిస్తూ పొతే
ఎన్నెన్నిభావాలు!
……………………………………….
6)
పక్కనే ఆసుపత్రి
ఇంటినిండా డబ్బు
వైద్యం లేక
మరణం
తనకంటూ నలుగుర్ని
చేర్చలేని డబ్బెందుకు
…………………………………………
7)
తెచ్చిన అప్పులు
మింగిన నేతలు
పాలకులేసే
పన్నుల భారం
ముందుతరాలకు
వెట్టిచాకిరీ.
…………………………
8)
అను దినం
క్రమం తప్పవు
ఉభయ సంధ్యలు
దివారాత్రములు
సమయ పాలనకు
సూర్యుడు ఆదర్శం
……………………………
9)
రెక్కలు
అతికించుకుని
పడిలేస్తూ
ఎగరాలని
ప్రయత్నిస్తేనె కదా
ఫలితం దక్కేది .
…………………………
10)
నానీలు నానోలు
హైకూలు రెక్కలు
ఇత్యాదులు
సాహిత్యపు వురవళ్ళు
క్లుప్తభావవ్యక్తత
భాషకు నేటి ఆవశ్యకత
………………………………
11)
నాకంటూ
నాదంటూ
ఏదీ లేనప్పుడు
భయమెరుగను
ఆశల రెక్కలు
ఎప్పుడైనా తెగొచ్చు.
………………………………
12)
ప్రజారోగ్యం
ప్రభుత్వ బాధ్యత
మద్యపానం
సమాజ రుగ్మత
ప్రజలేమైతేనేం
ఖజానానిండింది .
…………………………….
13)
ఎదిరించే శక్తి
ప్రస్నించే బలం
కరిగిస్తుంది
మధ్య పానం
ప్రజా నిర్వీర్యత
పాలనాసౌలభ్యత
…………………………..
14)
అద్భుతంగా
రంగులద్ది
ఆకాశం
ఓ వర్ణ చిత్రం
సూరీడు
చిత్రకారుడు
…………………………….
15)
శిల్పప్రముఖుల
చేతి కొనలను
నరికి తిన్నది
తాజ్ మహల్
పాలక నిర్మాతల
దాష్ట్నీకాల కొలమానం
……………………………..
16)
నా ఉత్సాహం
మిత్రుల ప్రోత్సాహం
ఎగురుతాయి
మిన్ను తాకి
ఆకసాన అలజడి
అల్లార్చిన రెక్కలు
…………………………………..
17)
చీమ
చిన్నదే
పట్టుదలకు
మేరువు
క్రమశిక్షణకు
మార్గదర్శి.
………………………………..
18)
వానమబ్బులు
ఎదుటి దిశలో
విరిసె సొగసుగ
ఇంద్ర ధనసు
మయూర నాట్యం
చూడ తరమా !
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
19)
భూమి లోపల
వేరు తీరున
భూమి వెలుపల
కొమ్మ తీరులు
ప్రక్రుతి బాధ్యత
సమతుల్యత.
……………………………….
20)
సిరలలో
చెడురక్తం
ధమనుల్లో
పరి శుద్ధిత రుధిరం
రెండు జీవనదులు
గుండె పిడికెడే
………………………………
21)
పండుటాకులు
వణుకుతున్నాయ్
అమ్మనుంచి
వేరౌతానని
చిరుగాలికి
దయలేదు .
……………………………..
22)
క్రమం తప్పక
సూరీడుదయిస్తాడని
అనుకుంటుంటాం
తిరుగుతోంది భూమి
వెట్టి చాకిరీ ఒకరిది
అనుభవం వేరొకరిది.
……………………………….
23)
నీలి సిగలో
హిమసుమం
తురుముకున్నది
శిఖరాగ్రకురుల
ప్రక్రుతి చేసుకున్న
అందంమైన మేకప్.
………………………………..
24)
భూతం
అనుభవం ..
భవిత
ఊహాతీతం
వర్తమానమె జీవితం
అదీ ఓ త్రుటి కాలం.
…………………………….
25)
మనిషికి
ఆశ సహజం
అత్యాశగా
మారకున్న మేలు
తృప్తికి మించిన
సంపద ధరిత్రిలో లేదు
…………………………….
26)
హింసోన్మాదం
వారినీతి
మారణకాండ
వారిమతం
అరాచకాలు
కిరాతక చర్యలు
27)
రాస్తూ పొ
అందాలొలుకు
అక్షరాల
సొగసులు
సానబెడితేనేగా
రాయయినా రత్నం
28)
చదగూడు
నిశితంగా పరికించు
అచ్చేరువందే
శిల్ప చాతుర్యం
చదగూళ్ళూ పాఠాలే
నిర్మాణం శిల్పశాస్త్రం
…………………………..
29)
ఎందుకో మనసు
కలతగా వుంది
అర్థం కాని వ్యధ
ఎదోఅంతరంగాన ….
మనుషులే మనుషుల్ని
ఎందుకు చంపుతున్నారు?
30)
బాల్యపు
జ్ఞాపకాలు
వూట బావిలో
నీరు
తోడినకొద్దీ
ఊట
31)
ఆకాశమే
మాకు హద్దు
నేలంటే
మరెంతో ముద్దు
పుడమితల్లి ఆలంబనలో
అంబరాన అందిన స్వేచ్చ
………………………………….
32)
చచ్చిన శవ మక్కడుండ
సానుభూతి పలుకులేడ
సూటిపోటిమాటలతో …
పీక్కుతింటు రాబందులు .
పేరుకు కొందరు బంధవులు
రాబందు లేంతో నయం .
……………………………………….
33)
బెల్లముంటే
చుట్టు చేరి
కొరికేసే
చలి చీమలు
ఆపదలో ఆదుకోరు
చిరునామా గల్లంతు.
…………………………………….
34)
దుక్కి దున్ని
విత్తు నాటాడు
చేతికొచ్చిన పంట
వానల పాలు
ప్రకృతికీ రైతంటే
గిట్టదెందుకొ !
…………………………….
35)
అప్పు దొరికింది
దుక్కిదున్ని విత్తితే
పంట పండింది
మహదానందం
పండిన పంట
అప్పులోళ్ళ పాలు
…………………………..
36)
భూమికి నెర్రెలు
ఎండి న పైరులు
భూమి ఆకాశం
చూసి చూసి వేసట
పురుగుమందు ఖాళీ
పేపరుకోవార్త.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
37)
కలుపుకు
మందేస్తే
పంటచేను
మాడింది.
అశ్రద్ధ చేయకు
అసలుకే మోసం
……………………………..
38)
గొర్రుతోవిత్తు
వరుసల్లో
మొక్కలు
వేరుకెంతో బలం
సాధనాలతో
సదుపాయాలేన్నో
………………………………
39)
మోటకు బాన
నాగటి కర్రు
బండికి చక్రం
ఎడ్లకు కాడి
చిన్నవో పెద్దవో నాడవి
సేద్యానికి అవసరాలు
…………………………..
40)
తెచ్చిన అప్పు
దారపు పోగుకు
నేసిన చీర
వడ్డీ తీర్చదు
నిత్యం హతమయ్యే
కొన్ని ఆత్మ లు
……………………….
41)
కమ్మరి,వడ్రంగి
చర్మకారుడూ
రైతుకు ఆప్తులు
నాడు నేడు
సహకారం వారిదుంటే
సన్న రైతుముందడుగు .
……………………………..
42)
అమ్మ మాటను
చెవిన పెట్టక
దారితప్పిన
గ్రహపు శకలం
భూమితాకితే
ఎంత కష్టం
………………………………
43)
అడవి లోన
కూలిపోయి
శిధిలమైనది
ఓ వృక్ష హర్మ్యం
కకావికలుగ దిక్కుకోక్కరు
నిరాశ్రయులా ఆశ్రితులు
…………………………….
44)
రెండక్షరాల
తంత్రం
జీవిలోని
ప్రాణం
వుంటే ఉత్తేజం
ఇగిరిందో నిస్తేజం
……………………….
45)
నిండు మేఘాలే
కురుస్తాయను కున్నా
వెతుక్కుంటూ పోయి
అడవి మీద కురిశాయి
ఎటుచూసినా
కాంక్రీటు భవనాలు
…………………………..
వాడోకటి
వీడోకటి
ఎవడికివాడు
ఒక్కడే
అందరోక్కటైతే
బలం ప్రబలం
………………………….
47)
బ్రతిమలాడుతూ
ప్రపంచానికి తమను
పరిచయం చేయమని
రాలిన ఆకులు.
నా కెమెరా
కన్ను పడింది .
………………………………
48)
పేదరికం
తొలగించడం
వారి
ధ్యేయం.
ప్రణాళికతోనిబద్ధతతో
పేదల నిర్మూలన
…………………………..
49)
మనిషికి
పశువుకు
వున్నతేడా .
మాట
మనిషికన్నా
వాటికే విచక్షణ ఎక్కువ.
………………………….
50)
పక్షి రెక్కలతో
ఎగురుతుంది
చెట్టు కొమ్మలతో
ఎదుగుతుంది
పరస్పరం
స్నేహితులు .
…………………………
51)
ప్రయత్నించి
పక్షి పిల్ల
రెక్కలతో
ఎగురుతుంది
రెక్కలుంటేనె సరిగాదు
సాధనా ఏంతో ముఖ్యం .
…………………………………….