బానిసత్వ బ్రతుకులు
శారీరక వేధింపులు
శూలాలతో ఘాతాలు
వంటి నిండ వాతలు
గొలుసులతో బంధనాలు
మలమూత్రపు గోతుల్లో
రోగాలతో రోస్తులతో పస్తులతో
బందీలై ఆ జీవులు…
చచ్చినోళ్ళు చావగా
మిగిలినోళ్ళ.. బ్రతుకా అది !!! ..

సాంఘిక వ్యత్యాసాలు
ఆర్ధిక వేధింపులు
తింటానికి తిండి లేక
కట్టుకోను బట్ట లేక
తల దాచు కోను గూడు లేక
ఒక చెట్టా? ఒక పుట్టా?
ఎటు పోనూ అదను లేక
చలికి వణికి ఎండల్లోమాడి మాడి
వానల్లో వరదల్లో
తడిసి జడిసి ..

ఒక రోజా,వత్సరమా
దశాబ్దాలు ,శతాబ్దాలు
కాదు కాదు
సహస్రాది వత్సరాలు
క్రూరంగా అతి ఘోరంగా
కవోష్ణ రుధిర కాసారాల్లో

కనలి కుమిలి
రాళ్ళల్లా,రప్పల్లా
మురుగులోని
పురుగులాగా…
తమ తోటి సాటి
మనుష జాతి సాగించిన
క్రూర ఘోర అమానుషం
ఆ అక్రుత్యాలెన్నో
ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్నెన్నని !!!?

హీనంగా చూస్తే.
హింసిస్తూ వుంటే
భోరు మంటూ ఏడ్చి
దీనంగా బతుకులీడ్చి
ఎతలతో నిట్టూర్పుతో.
యెవరూ తమ కోసం
ఒదార్చగ రారనుకొని…..

తమను తామే ఒదార్చుకొంటు
నేర్పుగా ..
మనసే ఆయుధంగా
అదనుకొరకు వేచి చూసి
ఒదిగి ఒదిగి ఒదిగి వుండి
ఒక్కసారే !!!!!!!
నేల నుంచి నింగికేగసి
నల్లని ఆ సూరీడు … చూడు
అంబరాన్ని చుంబించి
అధికారం అందుకొంటే ….
అవాక్కయి నోళ్ళు తెరచి
అంతా అంతా అంతా
అవనిలోన వారంతా
ఎంతో ఎంతో ఎంతెంతో ఆశ్చర్యంగా !!!!
(ఒబామాకు అభినందనలతో) రచన :నుతక్కి రాఘవేంద్ర రా వు,తేది :౨౧-౦౧-2009