ఆ సముద్ర తీరంలో పడివుందొక

ఇసుక పలుకు

పాపం!

తెలియదులే తన ఘనత తనకు

కడలిలో లో లోతుల

ఖనిజ శిలా సమూహాల

వుద్భవించి

అంతర్జల ప్రవాహాల రాపిడిలో

మాత్రు శిలను వీడిపోయి

విడివడి కడలి అలల కదలికల

ఓలలాదితేలియాడి

ఆకతాయి అలలతో

ఆటలాడి అలసి సొలసి

తనువు మరచి పడివుంది

తీరం చేరిన యా శిలా శిశువు

ఆ జిర్కోనియం యిసుక పలుకు

తనకేమీ తెలియకనే

వేరెక్కడికో తరలి పోయి

భావి భరత ప్రగతి కొఱకు …..

విద్యుత్ వుష్ణ వాటికల

అత్యున్నత వేడిమిలో

క్షారాలతో కలసి వుడికి

ద్రావకాల కనలి కుమిలి

ద్రవ రూపం…. ఘన రూపం ….

రేకు వలె గొట్టంలా

అణు ఇంధన కడ్డీలకు తొడుగు వలె

ఎన్నో ఎన్నో రూపాంతరాలు

అణు ఇంధన వుత్పాదక

ప్రక్రియలో

తనవంతుగ

భావి భరత గృహ సీమల

బంగారు కాంతులు నింపగ

భరత జాతి జన జీవితాలు

కళ కళ లాడే టందుకు

పాపం !!

ఆ జీవ రహిత శిలా శిశువు

స్వయం గా అర్పితమై

అంకితమై ………….. రచన : నూతక్కి రాఘవేంద్ర రావు , తేది :౨౯-౦౧-౨౦౦౯