శామూ తో శాన్డియాగో సీ వరల్డ్ లో ఓ అర గంట పాటు గడపిన అనుభూతుల వలయంలో నుంచి ఇంకా మేము బయట పడలేదు.అది అంత తేలికగా వీలయ్యే సామాన్య మైన విషయం కాదని చాలా లేటుగా తెలిసింది.. తెలిసిన వారికి అట్లాంటి అవకాసం వస్తే వదులు కోవద్దని మాత్రం ఖచ్చితంగా చెబుతాను . ఇట్లాంటి అవకాశాలు చాల అరుదుగా లభిస్తాయని చెప్పటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.ఈ లోకాన్నే మరచి కాసేపయినా ఆత్మానందాన్ని పొందే ఇటువంటి ఆవకాశం అత్య ద్భుతం .చక్కటి శిక్షణ ,అణకువ ,శిక్షకులు చెప్పింది వినే నైజం ,ఆ భారీ కాయం తో చూడ చక్కని రూపంతో సంగీతానికి అనుగుణంగా ,ఆ నృత్యం, ఆ జల క్రీడలు ,అత్యద్భుత విన్యాసాలు, సన్నిహితంగా పలక రింపులు ….షామూ వంద టన్నుల బరువుతో నలుపు తెలుపు రంగులతో నున్నన్నటి శరీరంతో చూడ చక్కగా వుండే ఈ జల చరం షుమారు ఏడు నుంచి పది అడుగుల ఎత్తు వెడల్పులతో ముప్పై నుంచి నలభై అడుగుల పొడవుంటుంది. ఆ ప్రదర్శనలో శిక్షక నిర్వాహుకుల అద్వితీయ సామర్ధ్యం అమోఘమనే చెప్పాలి.ఆ ప్రేమ ఆప్యాయత ఆదరణ , అకుంఠిత దీక్ష ,దక్షత అబ్బురమనే చెప్పాలి.
శామూ సాని హిత్యములో గడిపిన ఆ అరగంట సమయం లో బాహ్య ప్రపంచాన్ని పూర్తిగా మరపించి పోతావు .నీ మనసులో అసూయ , ఆవేదన, ఆందోళన, ఆక్రందన ,ఆవేశం, కావేషం, రోషం, దుఃఖం ,ఈర్ష్య ,ఇవేవీ దరి చేరవు. ఆ సమయం లో మనసు కాస్త స్థిమిత పడుతుంది.
అది శాండియాగో పట్టణం .అమెరికాలో నైరుతి దిశ లో కాలి ఫోర్నియా రాష్ట్రం లో వున్న ఫసిఫిక్ మహా సముద్ర తీర నగరం శాండియాగో పట్టణం.ఎన్నో ప్రపంచ ఖ్యాతి గాంచిన పరిశ్రమలు, సాఫ్ట్ వేరు కంపెనీలు ,అణువిద్యుత్ వుత్పాదక , సంస్థలే కాక ,లెగో లాండ్, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జంతు ప్రదర్శన శాల ,కొన్ని వేల ఎకరాలలో విస్తరించి వున్న జూ సఫారి, ఈ సి వరల్డ్ లోనే మనం ముచ్చటించుకొనే శామూ నివాస ముండేది. ఈ సుత్తి మాకెన్దుకయ్యా అసలు విషయానికి రమ్మని మీరు నన్ను తిట్టు కొంటూ ఎదురు చూస్తూ వున్న విషయం నాకు తెలుసు.
వస్తున్నా ,అక్కడికే వస్తున్నా.
శామూ అంటే ఎవరనుకున్నారు? సముద్ర జీవ రాజం, వేల్, ఆ జీవాలు ఆ సీ వరల్డ్ లో పది దాకా వున్నాయనుకుంటా, కొంచెం పెద్ద చిన్న సైజుల్లోన్నే గాని దేని పేరు షామూ నో ఎవరూ గుర్తించలేరు, నిర్వాహకులు, . .శిక్షకులు ఇచ్చిన శిక్షణ మహాద్భుతం .ఆ మూగ జీవాల అభిమానాన్ని ,ఆప్యాయతని పొంది వారి నిర్దేశ కత్వంలో చిలిపిగా ప్రేక్షకుల పై నీళ్లు చల్లడం,కవ్వించడం , సంగీతానికి అనుగుణంగా నీళ్ళల్లో నిలబడి ఆ భారీ కాయాన్ని బాలన్స్ చేసుకుంటూ నృత్యం చేయడం, శిక్షకురాలిని అమాంతం నీటి అట్టడుగునుంచి ముఫై అడుగులు పైకి లేచి మూతితో పైకి లేపి నిల్పెట్టడం, ఏడెనిమిది వే ల్స్ కలిపి సంగీతానికి అనుగుణంగా నర్తించడం ,ఇవన్ని ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తాయి .ప్రేక్షకుల పై నీళ్లు చిమ్మే టప్పుడు మొదటి నాలుగు అయిదు వరుసలలో వున్నవాళ్లు తడిచి పోతారు. అందుకు సిద్ధమై చాలా మంది పిల్లలు పెద్దలు ఆయా దుస్తులేసుకొని పోటీపడి ముందు వరసల్లో కూర్చుంటారు.
ఎన్నో ప్రఖ్యాతి చెందిన నగరాలు, కొన్ని వందల మైళ్ళ దూరం ఆ తీరం వెంట వ్యాపించి, పేరుకే పేరులు వేరయినా, నగర నిర్వహణలు, వేటికి అవే అయినా, చూపరులకు ఒకే బృహత్తర నగరంగా భాసిస్తూ వుంటాయి.అన్ని వందల మైళ్ళూ ఒకే నగరంలో ప్రయానిస్తున్నామన్న భ్రమ కలుగుతుంది.
ప్రపంచ ప్రఖ్యాతి గాన్చి న హాలివుడ్ సినీ ప్రపంచం, మరో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డిస్నీ లాండ్ , అమెరకా, మరియు ప్రపంచ చిత్ర రంగాన్ని ముని వేళ్ళతో నిర్దేశిస్తూ నాట్య మాడించే యూనివర్సల్ స్టూడియో లు వున్న నగరం లాస్ ఏంజిల్స్. సాన్డియాగో నగరానికి వుత్తర దిశగా ఫసిఫిక్ మహా సముద్ర తీరం ఆనుకొని విరాజిల్లుతోంది. ఆ మహా సముద్ర తీరాన ఆ మహా నగరాల గుండా రోడ్డు మార్గం లో ప్రయాణించడం జీవితంలో అద్భుత అనుభవం, జీవితానికో అను భూతి.ఈ పర్యటనలో ఎన్నెన్నో వింతలు విశేషాలు వున్నా షామూ ఒక ప్రత్యెక విశేషం .మిగతా విశేషాలు వాటి వాటి ప్రత్యేకతలు, ఆయా వ్యాసాలలో త్వరలో.
రచన : నూతక్కి రాఘవేంద్ర రావు . తేది :శుక్రవారం 27-02-2009
ప్రపంచ సినీ చిత్ర రంగంలో , తన దంటూ ఒక ప్రత్యెక ఒరవడి ఉన్నా, ప్రపంచ చలన చిత్ర రంగ చిత్ర పటం పై ఇప్పటి వరకు సంచలనాలు సృష్టించ లేక పోయిన భారత దేశం ,స్లం డాగ్ మిలియనీర్ ద్వారా ఎనిమిది ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులు ,పొందడం , అందులో భారత గాన గంధర్వుడు ఎ అర్ రహమాన్ ఆస్కార్ అవార్డు పొందడం భారతీయులందరూ సగర్వంగా గర్వించదగ్గ విషయం. కుగ్రామంగా మారిన ఈ భూ ప్రపంచంలో సమస్యలు ఏ ఒక్కరివో కాదు, మనమదరివి అని ,ప్రాంతీయత ,భాష, మతం ,ఏదీ , మానవతా కోనాన్నుంచి మనిషిని వేరు చేయలేవన్నది ఈ చిత్ర విజయం ద్వారా ,చిత్రానికి దక్కిన అవార్డుల ద్వారా నిరూపిత మైంది.
వాస్తవికత కోసం ,భారతీయ వీధి బాలలకు తర్ఫీదునిచ్చి వారి నుండి సృజనాత్మకతను వెలికి తీసి నటింప చేసి,ఇతర స్థానిక నటులతో,ప్రాంతీయ సాంకేతికతతో, నిర్మింపబడి, ప్రాంతీయన్గాను, విదేశాలలోనూ , మీదు మిక్కిలి అమెరికాలోని భారతీయుల లోనూ వ్యతిరేకతకు,ఆక్షేపణ లకు ,వివాదాలకు లోనయి ,వివాదాస్పద మయినా స్లం డాగ్ మిలియనీర్ చిత్రం,అ త్యధికసంఖ్యలో అవార్డ్లు పొందడం ముదావహమైన విషయం.
కధ ఏదయినా,నటీ నటులేవరయినా ,దర్శక నిర్మాతలు ఎక్కడి వారైనా ,అంకిత భావం,కధన విధానం ,దర్శకుని సృజనాత్మక ప్రతిభ ,ఒక చిత్ర విజయానికి యెంత ముఖ్యమో ఈ చిత్రం నిరూపించింది.
సినిమా ఆసాంతం ప్రేక్షకున్ని కదలకుండా కూర్చోబెట్టే లా చేసిన ఈ చిత్ర దర్శకుడు ,ఈ విశ్వ కుటుంబపు సభ్యుడే , ఆతడు ఆతని చిత్ర పరివారము ,అభినంద నీయులు , ప్రశంసా పాత్రులు.
[audio https://www.dropbox.com/s/vo92cmbp8anewc9/sankrathi_haridasu.mp3] మకర సంక్రాంతి ,తెలుగు లోగిళ్ళ లో అంబరాన్నంటే సంబరాల పెద్ద పండుగ . హరిదాసులు వూరూరా తిరుగుతూ చేసే గాత్ర కచేరి , గంగిరెద్దుల వాళ్ల సన్నాయి రాగాలు , గంగిరెద్దుల పద నాట్యం ,పాదాభివందనం , ,గాలిపటాల ఆకాశ నృత్యాలు , కొత్త చీరెల రెప రెపలు,కొత్త బట్టలు,కొత్త అల్లుళ్ళ సందడి ,అలక పాన్పులు,తీర్చడాలు, బావ మరుదుల ఎక సేక్కాలు , మరదళ్ల పరాచికాలు, …
జల్లల నిండ కూరగాయలు ,గంపల నిండా పిండి వంటలు ,పిల్లలు పోటీ పడుతూ ముంగిట్లో కూర్చొని ,పది మందికి పంచడం ,అరిసెలు, బూరెలు ,గారెలు, పూర్ణాలు,పరవాన్నాలు ,చ క్కిలాలు ,కారప్పూసలు,చేగోడీలు , వాటి ఘుమ ఘుమలు చెరకు తోటల లో బెల్లపు వంటలు, రామ ములగ (tomato),వంగ, బీర, తోటలు,పెరళ్ళ నిండా బంతి పూలు,చేమంతి పూలు, సంపెంగలు, దొడ్లో పందిళ్ళ నిండుగా కాసిన ,సొర , చిక్కుడు, పొట్ల పందిళ్ళు,జామ చెట్ల నిండుగా జామ పళ్ళు, దానిమ్మ పళ్ళు ,రామ చిలుకలు కొట్టివేసి క్రింద పడ వేస్తె వాటి కొరకు కొట్లాడుకొనే పిల్లలు, అహో …ఆ ..అను అనుభూతుల ఆ అనుభవాలు ఎంతెంతని ,ఎంతని చెప్పను,ఎవరికి దక్కును ఆ అనంతానందామృత ఝరులు తెలుగు వానికి దక్క .
హరిదాసు హరినామ గానం తో వుషోదయాన ఆ మేలుకొలుపు .ఇంటి ముంగిట….. కాదు …కాదు , ప్రక్క ఊరి పొలిమేరల ,….ఆ శబ్ద తరంగాలు ఆ సుదీర తీరాల శబ్దిస్తూ మనలను మేలు కొలుపు తాయి.
ఆ మహాద్భుత హరి నామ స్మరణ,త్యాగయ్యవిరచించిన శ్రీహరి గీతామృత ఆనంద గాన స్రవంతిలో సాగి పోతూ ,, హరి దాసు…. .ఆతని పాట, తంబురా నాదం,గానం ,తన్మయ నృత్యం ……,ఆ మఖర సంక్రమణ వేళ ,సంక్రాంతి నెల పట్టిన వేళ ,లేగ దూడలు చెంగు చెంగున గెంతే వేళ, కోడె దూడల మెడలో గంటలు మ్రోగే వేళ ,రంకెలు వేస్తూ కదలాడే వేళ ,ఇతర పశువుల అంబా రవాలు వినిపించే వేళ,పక్షుల కిలకిలా రవాలు , కావు కావున కాకుల గుంపులు అరిచే వేళ,పొద్దు చుక్క పొడిచిన వేళ ,చలి గణ గణ వణికించే వేళ , కుక్కోరో మని తోలి కోడి కూసే వేళ , రోడ్లు, దొడ్లు వూడ్చే వేళ ,కళ్ళాపి జల్లుల శబ్దాలు వినిపించే వేళ ,ఆ వేకువ తో లేచి ఆవు పేడతో కన్నియలు గొబ్బెమ్మలు చేసి, వాటిని పసుపు కుంకుమ పూలతో అలంకరించే వేళ , ఇళ్ళ ముంగిళ్ళలో రంగవల్లులు అద్దె వేళ ,అలంకరింప బడిన ఆ గొబ్బెమ్మలను రంగవల్లికలలో వుంచే వేళ ……ఆ వుషోదయ నేపద్యంలో మంద్రంగా ,సుదూరంగా వినిపించే అద్భుత నాదం ,అమృత గానం , ఆ చివరి పదం కృష్ణార్పణం …. అతనే హరిదాసు.
హరిదాసు, అందంగా కట్టుకున్నబంగారు జరీ తో కూడిన ఎర్రని పచ్చని పట్టు పంచె పై పసుపు పచ్చని పట్టు వస్త్రాన్ని నడుము చుట్టూ తిప్పి కట్టి,ఆకు పచ్చని పట్టు తల పాగా తలకు చుట్టి , మెడలోబంతి పూల హారంతో , పట్టు వుత్తరీయముతో ,నుదుట హరి నామంతో, భుజాలపైన, వక్షము పైన ,తిరు నామాలతో, భుజాన తుంబుర తో ఒక చేత్తో చిడతలు ,మరో చేత్తో తుంబుర మీటుతూ, శిరస్సు పై , పసుపు కుంకుమలతో,తిరు నామంతోనూ ,పూలతోనూ ,మామిడి ఆకుల తోనూ ,అలంకరించ బడిన ,ప్రత్యెక రీతిలో తయారు చేసిన ,తళ తళ లాడే రాగి పాత్ర శిరస్సు పై నున్న సిరాస్చ్చాదనపై ధరించి,ఆ మాసంలో రోజులు గడిచే కొద్ది ఒక దాని పైన మరొకటిగా పాత్రలు, అలం కర ణలు పెరిగి పోతూ వస్తాయి. ,ఆ పాత్రలు వె డల్పుగా ఎత్తు తక్కువగా వుండి,ఒక దాని కంటే మరొకటి చిన్న దయిన పాత్ర లు, ఒక దాని పై మరొకటి పెంచుతూ ,.నెల చివరికి వచ్చే సరికి నాలుగు అడుగుల ఎత్తున ,పాత్ర పాత్రకి బంతి పూలతో,పుష్పాలంకరణ ,పసుపు,కుంకుమ, తిరు నామాలు మామిడి ఆకులు , వీటన్నింటితో అలంక రించి ,వాటన్నింటిని , తల పయిన స్థిరంగా నిల బెడుతూ ,పడకుండా నియంత్రిస్తూ, సాధన చేస్తూ (ఆ పాత్రలు పెంచే లెక్కల ప్రాతిపదిక ఈ వ్యాస రచయితకు తెలియదు. పాత్రలు పెరుగుతున్నప్పుడు బిక్ష అందుకునేందుకు, తాళం వేసేందుకు ఒక సహాయకుడు వెంట వుంటాడు..) ఒకదానిపై ఒకటి పాత్రలు పెంచుతూ నడచి వస్తుంటే , గాలి గోపురంతో సహా ఆ పాండు రంగడు నడచి వస్తున్నాడా అని తలపించే మహత్తర ఆహార్య ముతో, ……
చేతి చిడతల శబ్దాలతో , చిందులేస్తూ ప్రదక్షణ రీతిలో తిరిగే సమయయంలో వింత వింత గా ధ్వనించే కాళ్ళ గజ్జల రవళి వినిపించే వేళ ,తంబుర నాద తరంగిణిలో మమై క మై ,ఒక పాదం పై బరువు వుంచి మోకాలు నేలకు మోపి వినయంగా కూర్చొని తల వంచి తలపయినున్న పాత్రలో గృహ యజ మానురాలు బిక్ష వేసేటప్పుడు హరి దాసు పలికే పదం ‘కృష్ణార్పణం’ .
తెలుగింట ప్రతి యింట, సంక్రాంతి మాసాన
హరి దాసు లేనిదే సంక్రాంతి యే లేదు,
గంగిరేద్దె రాని ముంగిలే లేదు
కళ్ళాపి చల్లని లోగిలే కనరాదు
రంగ వల్లిక లేని కళ్ళాపి లేదు,
గొబ్బెమ్మ పెట్టని రంగవల్లిక లేదు ,
గొబ్బెమ్మలే లేని రహదారి లేదు .
యింటి యింటిని కలిపి,
వాడ వాడను కలిపి ,
వూరు వూరును కలుపు ,
అందాల అతివల
హస్తాల వైచిత్రి
అందాల ఆ ముగ్గే
సంక్రాంతి ముగ్గు
నా చిన్న తనాన ప్రతి ఏడూ, విన్న ఆ తంబురా నాదం ఆ త్యాగయ్య పద విరుపులు ,ఆ పలుకు లు .. ..,నెల పట్టిన దగ్గర నుండి ఆ మాసపు ప్రతి రోజూ,దూరంగా ప్రక్క వూళ్ళో పాడుతుంటే ,ఆ పాటలు అలా అలా గాలి అలల పై తేలియాడుతూ అలరించే వేళ, తల విదిల్చిపిల్లలందరం నిద్ర లేచి, కాల క్రుత్యాదులు చేసుకుని , ఆ చలిలో వణుక్కొంటూ, పుల్లలతో చలి మంట చేసుకొని ,ఆ మంటల వేడి లో చలి కాచు కొంటూ …….
హరిదాసు (సాతాని జియ్యరు) కు బిక్ష వేసేందుకు ,నేనంటే నీనని పిల్లలంద రం , కొట్లాడు కొనే వేళ ,
ఆ హరిదాసు (సాతాని జియ్యరు)వస్తే, నేనంటే నేనే ముందని మేమనుకుంటుంటే బాబూ నీవు సగం వేయమ్మా ,పాపా మిగతా నీవు ….కృష్ణార్పణం ……అనే ఆ హరి దాసు….ఆతని పేరేమిటో, వూరేమిటో ఏమీ తెలియదు గాని, ఆ అనుబంధం అంతరించి అర్ధ శతాబ్ది దాటినా
ఇప్పటికి …ఆ పదం ..కృష్ణార్పణం… శ్రవణా నంద కరం
ఆ ఆహార్యం
ఆ గానం, గాత్రం ,నృత్యం ,
వాద్యం,పలుకు, నడక,
నడత అంతా ,ఆ జ్ఞాపకాల
అలజడులు కంపనలు
నా మస్తిష్కపు, లోలోతుల,
నా తనువున కణ కణా న,
నా మది లోపలి పొర పొరలో
పదిలంగా భద్రంగా…
..కృష్ణార్పణం…
ఆశ -ఆనందం నడుమ అనంతానంత అగాధం
ఆనందపు అనుభూతిని అందుకొనుట ఎంత కష్టం
అంతటా కంటకాలు
కందకాలు, అడ్డంకులు నిరాశ, నిస్పృహ దుఖం , బాధ, క్రోధం
అత్యాశ, అహంకార మదపూరిత, మాస్తార్యంఆ అడ్డంకులు ,ముళ్ళపొదలు
అన్ని అన్నింటిని అగాధాన నెట్టి వైచి
త్రిప్తి అనే వంతెన తో ఆవలి తీరం చేరుకో
అనుభవించు అనుభవించు ఆనందపు లోకమదే అంతా నీకొరకే!
అందుబాటులో వున్న
పూవు కోసుకో గాని
చిట్ట చివరి కొమ్మ నున్న
పండు కొరకు పాక బోకు
దొరికిన దానితోనే
సంతృప్తి ని పొందు కాని
దొరక నట్టి దానికొరకు
వేసటపడి భంగ పడకు.
రచన: నూతక్కి రాఘవేంద్ర రావు ,మార్పు తేది:౧౮=౦౨-2009
అపుడెపుడో ఏదేదో
చేయ లేదె అనుకుంటూ
నిట్టూర్చుతూ కూర్చుంటే …
ఇపుడైనా చేయకుంటే !!!
జరిగిన కాలమింక నీ
దరికి మరలి రాదు కదా !
జీవన కాలమేమి
కొంచమైన పెరగదు కదా !
తెలుసుకొంటే
వెసులు బాటు
తెలియకుంటే
కర్మ కాటు
రచన:నూతక్కి రాఘవేంద్ర రా వు , మార్పు తేది :౧౮-౦౨-2009
అయ్యా నిన్న ఏదో పనుండి వెళ్ళాల్సి వచ్చిందండి.నిన్న ఆ సత్తిగాడి ప్రశ్నలు గుర్తొచ్చి అసలు నేను బయటకు ఎందుకొచ్చానన్నవిషయం మరచి పోయా నంటే నమ్మండి .ఇవ్వాళయినా వాడి గురించి ఎక్కువ ఆలోచించకుంటే మంచిదండి.
నిన్న ఇక్కడ నుంచి ఎలతా వుంటే మళ్లీ వాడు కలిసాడండి. కలిస్తే వూరు కోడు కదా ,వాడు మాట్లాడటం అడగటం మొదలేడ్తే నేనేకాదు ఎవ్వరైనా ఆగాల్సిందే. వాడు నా ఎదురుగా నిల బడి నన్నాపి నమస్కారాలు పెట్టి వాడన్తాడూ…
అయ్యా నిన్న తొందరగుంటే బేగి ఇంటి కెళ్ళి పోయిన గదున్దన్దయ్య,అయ్యా నాకు తెలియ క అడుగుతానందయ్యా ,ఆడోల్లకి ,మగోల్లకి , మనమే ఎందుకండందయ్యా సాన ఎత్తాసం సేత్తాం .మనకి పుట్టినోల్లలోనే ఆడ బొట్టిల్ని ఒక రకంగా ,మగ పిల్లగాళ్ళని ఒక రకంగా సూత్తాం గదన్దయ్య,ఎందుకంతెనండయ్య ,ఎనకటి కాలాలో నయితే ఆడాళ్ళని సదివించే తోళ్ళు కాదు,ఆడది సదివి వూల్లేలాల్న అనేవోళ్ళు , ఆమ్మలు అమ్మమ్మలు కూడా అట్లనే సంగేతం పాడేవోల్లు. ఆడాళ్ళు ఎదక్కుండా ఆడాళ్ళేఅడ్డంకీ కదండయ్య,ఆల్లు నిజంగా నిజెం సేప్పారయ్య. కాని ఇప్పుడట్టా కాదు గడన్డయ్య ఆడ బొట్టిల్ని సదివిస్తాన్నం ,ఆల్లు సాన గొప్పగ సదూకుంతన్నారు ,వుద్దేగాలు సెత్తన్నరు, ఇంక ఆబిడ్డకి పెళ్లి సేయ్యలంటే ఈజీ
అయిపోదంకున్తున్నారు గాన్దయ్యా ,అంట తేలిక కాదందయ్యా .బొట్టి కంటే కుంచేమన్న ఎక్కువ సదివుండాలిగడకాదేన్తందయ్యా ,ఈ రోజుల్లో బొట్టిలు సాన ఎత్తు పెరిగి పోతుంటి రయ్యే ,పిల్ల గాడు జరన్న ఎత్తున్దాలే కాదన్డైయ్య , ఆడ బొట్టిలు నాజూకుగా అందంగా ఎదుగుతున్నారు గదందయ్యా, చూస్తా చూస్తా గలీజోన్ని తేలేం కదందయ్యా,ఇంక,
కుటుంబాల సంగతి కొచ్చా మానుకోండి ,అదంతా మంచి గానే వుంటది గానందయ్యా,అసలు ఆని గుణం గురించి, ఆరోగ్యం గురించి, అలవాట్ల గురించి ,అందరితాన మంచి రిపోర్టే ఒస్తాదయ్య,దోస్తులు గని,ఎవ్వరూ సేడ్డగా సెప్ప రయ్య.గుణం దేవునికే ఎరకయ్య. నాయకి అమ్మకి ఆని బుద్దులెం తెలుస్తయందయ్యా ఈ రోజుల్లో జాతకాల పిచ్చి ముదిరింది గానన్డయ్య, అది మొగ పిల్లగాడు ,పిల్ల నాచనేడని సేప్పకుండా జాతకం కలవట్లేదని మంచిగా తప్పించుకునేందుకు పనికొస్తన్నయ్యయ్యా. జాతకాలు కాదయ్యా సూదాల్సింది ,పెళ్లి సేద్దామనుకున్నప్పుడు ,ఆడఅ పిల్లకి ,మగ పిల్లగానికి ,పరీచ్చలు ,అదెనడయ్య , డాక్టరు పరిచ్చలు సేయించి తే నందయ్య , ఇద్దరికీ అన్ని మంచిగుంటే పెళ్లి సేయ్యోచ్చు,లేకుంటే మానేయోచ్చు గదందయ్యా.ఈ రోజుల్లో ఎవర్ని నమ్ముతామందయ్యా,పెళ్లి అయిన తరవాత,
ఎయిడ్స్ వొందనితెలిసిన్దనుకొందయ్యా , లేదా కిడ్ని పాదయ్యిందని తెలిసిదనుకొందయ్యా,సుగారుందని తెలిసిన్దనుకొందయ్యా,సాన కష్టం కదండయ్య, మండులున్న జబ్బులయితే రోగం నయం చేసు కోవచ్చు గాని సూత్తా సూతా ఎందుకు దిగాల్నడయ్య,అందుకే పెళ్ళికి ముందే మొకమాతం లేకుండా అన్ని పరిచ్చలు సేయించాలే అని నా వుద్దేసమందయ్యా.నాకు తెలిసో తెలియకో వాగానందయ్యా ,నన్ను చమించందయ్యా . బేగి పోవాల్నందయ్యా, రేపు ఈడనే కలుస్తానందయ్యా . వాడితో ఇంకేం మాట్లాడుతామంది తలూపటం తప్పితే.