యూసమిట్ వ్యాలీ :

అక్కడకు వినోదం కొరకే గాక ,విజ్ఞానం కొరకు ,విద్యా ప్రాప్తికి, పరిశోధనకు, ప్రతి నిత్యం ,అనేక వేల మంది పర్యటిస్తూ వుంటారు. ప్రభుత్వం ఈ పర్యాటక కేంద్రాభివ్రుదికై వెచ్చించిన మొత్తాన్ని పర్యాటక్యాభి వృద్ధి ద్వారా తిరిగి రాబట్టుకో గలుగు తోంది. ఈ విధానం ఏ దేశానికైనా అనుసరణీయం.
వేల ఎకరాలలో అమెరికాలో వున్న యూసమిట్ ప్రాంతం ఆరక్షిత జాతీయ వనం. ఇక్కడకు చేరడానికి అనేక ప్రాంతాలనుండి సురక్షితమైన,సౌ కర్యవంతమైన రోడ్లు వున్నాయి. ప్రభుత్వ రవాణా సౌ కర్యాలున్నా ఎక్కువ మంది తమ వాహనాల్లో వస్తుంటారు. మధ్య మధ్య వసతి గృహాలలో విడిది చేస్తూ ఎంతెంతో దూరాల నుంచి కూడా రోడ్ ద్వారా ప్రయాణం చేసి వస్తుంటారు. శ్రమ ధన ప్రయాసలతో కూడుకొన్న దే కాని ఈ యాత్ర అద్భుత ఆనందానుభూతుల్ని మిగుల్చుతుందనడంలో సందేహంలేదు.ఈ ఆనందాన్నిజ్ఞాపకాలను నా జీవితాంతం మిగుల్చు కొంటాను.

వన్య భరిత పర్వతాలతో, శిఖరాలతో ,ఎలుగుబంట్లతో సింహాలు పులులు ,జింకలు ఇత్యాది ఎన్నో ఇతర జంతు జాలంతో,వాటి అరపులతో రకరకాల పక్షులతో ,కిలకిలారావాలతో ,జలపాతాలతో , సాంద్ర తరమై సు విశాలమైన కైవారాలతో ఆకాశాన్నంటే సాంద్ర తర వ్రుక్షారన్యాలతో ,ఔషధ జాతుల మొక్కలతో, సెలయేళ్ళ పరవళ్ళతో , సుందర వర్ణ భరిత వుద్యానవనాలతో ,నదులతో ఆ లోయ ప్రతి నిత్యం సజీవంగా కళ కళ లాడుతూ అలరారుతుంటుంది.

ఇక్కడి స్థానిక ప్రజల, ఆటవిక జాతుల పునరావాసానికి, అభ్యున్నతికి ,సంక్షేమానికి ,అమెరికా ప్రభుత్వం అమిత శ్రద్ధ తీసుకుంటోంది.ఇక్కడి ప్రభుత్వం సామాజిక అవసరాలకు సేకరించే భూమి కి చెందిన భూమి పుత్రులను వారి మానాన వారిని గాలికి వదలదు.ముందే పునరావాసానికి ప్రణాలికలు రచించి ఆచరణలో పెడుతుంది.దానికి కావలిసిన నిధులను సమకూరుస్తుంది. ఇదంతా ఆ యా కార్యక్రమ నిర్మాణం లో భాగంగా కొనసాగుతుంటుంది .

ప్రతి దేశానికి ఈ ప్రక్రియ ఆదర్సనీయం.

పర్వతాలను, శిలలను ,అడవుల్ని, ఓషధ జాతి మొక్కలిని ,లోయలను, సెలయేళ్ళను, జలపాతాలను, జలాశయాలను ,రహదారులను,అక్కడి జంతు వృక్ష సముదాయాన్ని కాపాడేందుకు ,వివిధ భాగాల్లో పరిశోధనలు జరిపేందుకు వేరు వేరు ప్రభుత్వ విభాగాలున్నాయి. వేల మంది విశ్వ విద్యాలయ విద్యార్థులు యిక్కడ వివిధ రంగాల్లో పరిశోధనలు చేస్తుంటారు. పర్వతారోహణ ఇక్కడ ప్రత్యెక క్రీడ.మంచులో ఆడే క్రీడలకు కూడా యిక్కడ ప్రత్యేకసరదా చూపుతారు. ఇక్కడ యాత్రలో అనేక వింతలు విశేషాలు చూడవచ్చు.పర్వతాలు, శిఖరాలు,శిలలు శిలాజాలు ,మహోన్నత వృక్ష జాతులు, లోయలు, జలపాతాలు, సెలయేళ్ళు ,పక్షులు, ఆరక్షిత జంతు జాలం ,ఒకటేమిటి అనేకం.

అందులో ప్రత్యెక మైంది హాఫ్ దోం అని పిలవ బడే శిఖరం.ఆ లోయ నుండి ఆ దృశ్యం చూడ టానికి అద్భుతంగా వుంటుంది . నేను దానికి ప్రత్యేకమైన పేరు పెట్టుకున్నాను . అది చూడటానికి… ఒక పక్షి పిల్ల, తల్లి తెచ్చే ఆహారం కోసం గూటిలోనుంచి తల బయటకు పెట్టి ఎదురు చూస్తున్నాడా అన్నట్లు ..భావన నాకు కలిగింది. కాబట్టి దానిని చిక్ బీక్ దోం ( డ కారం లో ఒత్వం పలకడం లేదు. )అని పేరుపెట్టాం. చిక్ అంటే పక్షి పిల్ల ,బీక్ అంటే ముక్కు. కొన్ని కొన్ని కాలాల్లో (సాయంత్రం వేళ మాత్రమె) సూర్యుడు పశ్చిమ ముఖుడై తరలే తరుణాన ఆ లోయలో పర్వతాల నీడల కదలికల పరిణామ క్రమంలో ప్రస్ఫుటంగా ఒకే ఒక శిఖరం పై కాంతి మిగిలి వుండి ఆ దృశ్యం ,మహాద్భుత దృశ్య కావ్యంగా ఆవిష్కరింపబడుతుంది . సూక్ష్మ దృష్టితో, విమర్సనాత్మకంగా ,పరిశోధనా పరంగానూ ,వాస్తవ పరంగానూ చూస్తే నా ఈ వ్యాసంలో లెక్కకు మించి దోషాలు కనపడవచ్చు. కాని వాస్తవ దూరాలు మాత్రం కాదు. న పర్యటనలో కలిగిన ఆనందానుభూతుల్ని నలుగురితో నా భాషలో నా వారితో పంచు కోవడమే ఈ వ్యాసం ముఖ్యోద్దేశ్యం.

ఇక్కడకు పర్యాటకులు రోజూ వేల సంఖ్యలో వస్తుంటారు .కొద్ది మందికి మాత్రమె అక్కడ బస చేసే అవకాశముంది మిగిలిన వారు ఆ రోజు సాయంత్రానికి తిరిగి వెల్ల వలసినదే..,మనం మన అవసరాలకు ఆహారం నీరు తీసుకు వెళ్ళినా, అవసరానికి భోజన ఫలాహారాది సదుపాయాలు,సోవ్చాలయాలు వున్నాయి.

నా అనుభూతులు:
ఆ దృశ్యం :
చిక్ బీక్ దోం (అని నె పిల్చుకొనే )
హాఫ్ దోం

రచన : నూతక్కి రాఘవేంద్ర రావు. తేది : ౧౧ – ౦౨ – ౨౦౦౯