ఏప్రిల్ 2009


 

జ్ఞాపకాల దొంతరలు

(ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలతో )

శ్రీ సంజీవదేవ్.-పేజి -1

రచన :నూతక్కి రాఘవేంద్ర రావు. తేది:01-05-2009.

 శ్రీ సూర్యదేవర సంజీవ దేవ్ గారి గురించి నేను చెప్పాలని ప్రయత్నించడం సూర్యుని చూపడానికి దీవిటీ వెలిగించే చందమని నాకు తెలిసినా వారితో నాకున్న కొద్దిపాటి పరిచయంతో పెంపొందిన సన్నిహితత్వం ,వుత్తర పత్యుత్తరాలు ,నా కొరకే రాసి ,నాకు పోస్ట్ చేసిన కవితలు ,వర్ణచిత్రాలు ,ఆయన జ్ఞాపకాల దొంతరలు నా మదిలో పదిలంగా. ..ఇప్పటికే ఎందఱో వారి గురించి అనేక మాధ్యమాల ద్వారా విశదపరిచినా, వారితో నాకున్న సాన్నిహిత్యాన్ని కొంత మీతో పంచుకొందామని. దుగ్ధతో .మొదటి విడతగా ఆయన గురించి…నాకు తెలిసిన సేకరించిన కొన్ని విషయాలు మీ కొఱకు …. శ్రీ సూర్యదేవర సంజీవదేవ్ గారిది గుంటూరు జిల్లా ,తెనాలి తాలూకా ,దుగ్గిరాల ఫిర్కా లోని ఓ చిన్న గ్రామం .అవడానికి చిన్న గ్రామమైనా అత్యధికులు ధనవంతులే ,విద్యాధికులే .పూర్వీకులు అమరావతీ రాజ్యాదిపతుల వద్ద మంత్రులుగా,సేనాధిపతులుగా వుండటం వల్ల గ్రామంలో అత్యధికులు విద్యార్జన పొంద గలిగారు.వీరిది కూడా ఆ తరహా వంశమే.వసుధా భాగ్యవంతులు ,భూకామందులు. .ఆ వాతావరణం లో ఆయనకు కావలిసినంత స్వేచ్ఛలభించింది.. ఆయన తన పదహారవ ఏటనే హిమాలయాలను వీక్షించాలని ఆసక్తితో అక్కడకు వెళ్లి ఆపర్వత మహాద్భుత సౌన్దర్యాలకు ఆకర్షితులై అక్కడే వుండిపోయి ప్రభుద్ద భారత్ అనే పత్రికా సంపాదక వర్గంలో పనిచేసి తరువాత కులు వాలీ లో నికోలస్ రోచి అనే మహనీయునికి అతిధి గా గడిపిన ఆ రోజుల్లో హిమాలయాల సుందర దృశ్యాలు, అద్భుత సూర్యోదయాలు అస్తమయాలు ఆయన హృదయాన్తరంగాల్లో పరివేష్టితమై అనుక్షణం ఆయనను వెంటాడుతూ వుండేవి. ఈ మహోన్నత నేపధ్యంలో ఆయనలోని కవి, భావకుడు , చిత్రకారుడు, కళా విమర్శకుడు, వేదాంతి ….తమ తమ స్థానాలను సుస్థిరం చేసుకొని,ఆయా రంగాల్లో నిష్ణాతునిగా మార్చడం జరిగింది. ఆయన సరళ ,భాషా కోవిదుడు. వివిధ భాషా ప్రఖండుడు.సృజనాత్మకత ఆయనకు జన్మతహా లభించిన వరమనే చెప్పాలి..ఆయన వాస్తవ సామాజిక జీవన రీతులను ఔ పోసన పట్టిన దార్సినికుడు. ఆయనకు ఆంధ్రా యూనివర్సిటీ వాల్తేరు వారు 1982 లో గౌరవ D.LiT పట్టా తో గౌరవించారు .ఆయన ఇంగ్లిష్ లోను , తెలుగులోనూ పలు గ్రంధాలు రచించారు.ఇంగ్లిష్ పుబ్లికేశాన్స్లో ప్రముఖ మైనవి, గ్రే & గ్రీన్ , ,బయో సింఫోని మరియు హర్ లైఫ్ .వారు మిత్రులకు ,అభిమానులకు పాఠకులకు వ్రాసిన లేఖలు ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని కూడగాట్టుకున్నాయి.ఆ లేఖా సంపుటాలు పలు మార్లు ముద్రణకు నోచుకున్నాయి. లేఖా రచనలో ఆయన శైలి అద్వితీయం.ఆయన జీవన శైలి, అభిరుచులు ,శ్రీ ఆనంద్.కే కుమారా స్వామినో ,శ్రీ రవీంద్ర నాధ్ ఠాగూర్ నో ,శ్రీ జిడ్డు కృష్ణ మూర్తినో జ్ఞప్తికి తెస్తాయి…

   

         శ్రీ శ్రీ
రచన : నూతక్కి రాఘవేంద్ర రావు
తేది:30-04-2009.
 
  శత వత్స రాలు వయసొచ్చినా 
   శ్రీ శ్రీ  ఆరోగ్యంగా   వున్నాడు .
 చచ్చి పోలేదు..ఈ శతాబ్ది తనదని 
   నమ్మిన సాహితీ ,ప్రఖండుడు
  జన హృదయాలలో సుస్థిరంగా
       జీవించే వున్నాడు.
   ఆయనకు వందో జన్మ దిన
        శుభాభినందనలు .
     ఆ సందర్భంగా సాహితీ
   ప్రియులందరికీ శుభాకాంక్షలు.
 
            ఆ రోజుల్లో
       వ్రాయాలని  వున్నా 
     వ్రాయలేని అసహాయత 
భావాలు మనస్సును మదిస్తున్నా 
    భావ వ్యక్తీకరణకు ఎన్నెన్నో  
           పరిమితులు.  
      అడ్డంకులు అగాధాలు
     చాన్దసాలు చందస్సులు
      కఠిన పద  భావ జాల 
             సమాసాల
       సాహితీ యానంలో 
      వేగు చుక్క పొడిచింది. 
      ఎందరికో స్ఫూర్తిదాత
      ఓమహాత్మ ఓ మహర్షి
             మార్గదర్సి,
           మహా స్ఫూర్తి 
         ఓ మహానుభావ
 
      తెలుగు భాషామ తల్లి
       ఛందో బద్ధ రీతుల
       జిలిబిలి వెలుగుల 
       వలువలలో బందీ…. 
        మాన్యులకేదక్క  
       జన సామాన్యుని
    కందని  ఆ తరుణంలో

    ఈ సాహితీ ప్రపంచాన

    చాందస సృంఖలాలు
            త్రెంచి  
        ఈ యుగం 
     ఈ శతాబ్ది నాదని 
    చాటుకున్న ధీశాలీ  
  నీ తదుపరి ఆ సాహసం 
         చేసేవారేరీ 
       చేసిన వారేరీ    
.
  నీ  భాషా పద చాతుర్యం 
     నీ భావం భాష్యం
   ఆనాటికి  ఈ నాటికి 
   పాపం నీ మనోగతం  
   ఎవరికీ అర్ధం కాకున్నా
నిన్నర్ధం చేసుకున్నామనుకొని
  నిన్నంతా చదివేసామని 
    నిన్నడ్డం  పెట్టుకొని   
తమ్ము తాము పోగుడుకొంటు 
   నిన్నందల మెక్కిస్తూ
 తామూ పైకెగబాకుతో …ఈ
  మహత్తర దృశ్య నాటకం  
 చూడకుండానే వెడలి పోయి …
      ఎం సాధించావు ….
 
 నీవనుకున్నది ఏదీ యిక్కడ
    సజావుగా జరగలేదు
     నీవాసించినదేదీ
    ఆచరించేవారులేరు.
  నీవు కోరుకున్నదేదో
తమకోరికేలే అని నమ్మిన
    హీనులు దీనులు
యింకా నీకోసం ఎదురు
  చూస్తూనే వున్నారు
నీ ప్రస్తానం తమ కొరకే
       కావాలని
    ఈ దిక్కుననే 
  నీ మహా ప్రస్తానం
  (మహా కవి శ్రీ శ్రీ గారికి
      క్షమార్పణలతో )
 
  
 
    

 

నజ్జు నజ్జు  అంతే

రచన : నూతక్కి రాఘవేంద్ర రావు
        తేది :30-09-2009 
 
ఆ క్షణమే నా కను సన్నల
    గాంచిన  ఓ  దృశ్యం  
    విచలితుడనై  నేను 
      మూలుగుతూ 
      నా  మనస్సు 
కనులముందు తిరుగాడుతూ
       ఆ దృశ్యం ..
     కీసు మంటూ .
ఆగిన కారు చక్రాల బ్రేకుల
కర్ణ కఠోర క్రీన్కారాల మధ్య 
కూయ్ కూయ్ గ్రా ఆ ఆఆ
 కుక్కఆక్రన్దిస్తున్న  రీతి 
    భీకరంగా రోదిస్తూ 
       అంతలోనే
    తుఫాను వెలసిన 
        ప్రశాంతత  
      ఏమయ్యిందీ 
    అబ్బే ఏమీ లేదు 
         కుక్కే  
  కారు  క్రింద  పడింది.
   ఏమీ కాలెదుకద  
నలిగి నజ్జయింది అంతే    
  
 
 
       మా  పెరటి చెట్టు కొబ్బరి బోండాం
(పొందడమో సాహస చర్య… తాటి  కాయకయినా  అంతే)
(నాకూ కొబ్బరి  చెట్టుందని చన్కలెగరెస్తె  సరి పోదు బాబూ.)
                           ( ధర్మవరపు స్టైల్లో అనుకోండి స్వగతంలో)
         రచన : నూతక్కి రాఘవేంద్ర రావు.  
                 తేది:29-04-2009
            మా పెరటిలోని కొబ్బరి చెట్టు
            నా స్వంత చేతులలోపెరిగింది   
               కాసింది కాయలు యెన్నో   
            మండుతున్న వేసవి ఎండలొ   
              దాహమేసి  తాగాలనుకొని 
             తపనపడుతూ గుటకలేస్తూ  . 
              చేయని  యత్నం లేదు
              చెట్టునుంచి బోండాలను
            రాల్చేందుకు ..త్రాగేందుకు  …
                చెట్టెక్కి కోసే వాళ్ళు
              మహానగరాన ఎక్కడో      
                   ఓ పొడుగాటి
                 వాసం బొంగుకు  
                  కత్తి కట్టి మరీ 
             బోండాలను రాల గొట్టి
                 నెత్తులు పగిలే 
              ప్రమాదాలు తప్పుకొని           
              మొత్తానికి సాధించాం
                     అయినా             
              బోండమెలా త్రాగాలొ
        అమాయకంగా వెర్రి మొఖాలతొ
              చెట్టెక్కి కాయ రాల్చి…
          బాబోయ్ మనవల్ల కాదు.
            కొబ్బరి బోండాలు కొని
                 త్రాగేస్తే  పోలా !
 
        మరోసారి స్వంత కొబ్బరి  చెట్టు
            నాటాలని అనుకున్నా
        దాన్ని పెంచాలని అనుకున్నా  
                  కాయనీరు … 
            బోండాం కాయ నీరు 
           త్రాగాలని అనుకున్నా  
          చెట్టెక్కుట నేర్చుంటాం 
     మొదట చేట్టేక్కుట నేర్చుకుంటాం
      కొబ్బరి చేట్టేక్కుట నేర్చుకుంటాం  .   

 

 

 అభిలాష  

రచన:నూతక్కి రాఘవేంద్ర రావు
       తెది:28-04-2009

       సంకల్పం 
   సాధనకో పునాది
ఆ పునాదుల ఆలంబనతో 
 అధునాతన ప్రపంచాన
 రంగ రంగ వివిధ రంగ
   అబ్బుర పురోగతి 
      మహాధ్భుత  
       అధ్భుతాల
  పునాదుల అట్టడుగున 
   శిలా  శ్ఛిద్ర  రూపాల్లో
  వేల వేల సంకాల్పాలు  
  ప్రేతాత్మలై   క్రేంకారాలు 
 స్వయం  ప్రేరిత వూహల
 
క్రియా శీల భౌతిక రూపాలను  
  ఒక్క సారి ఒకసారయినా
          స్వయంగా
         వీక్షించాలని      
           వెర్రిగా
          వేదనతొ
        అభిలాషతో     
 

 

మామిడి పళ్ళు, వాటి రకాలు, పేర్లు.

రచన: నూతక్కి రాఘవేంద్ర రావు.
తెది: 27-04-2009

నాకు తెలిసినంతవరకు, మామిడి పండ్లలో దరి దాపు నలభై రకాలు విన్నాను,తిన్నాను,
చూసాను.అందులో కొన్ని మాత్రమే గుర్తున్నాయి.

1) బంగినపల్లి: పసందయిన పండు.ఆంధ్రుల అభిమాన ఫలం ,కోత పండు

2) హిమాం పసందు: పేరెందుకు వచ్చిందో కాని అందరికీ పసందయినదే, కోత పండు.

3) మల్గోబా: ఇదీ కోత పండే కాని  ,ఎరుపు ఆకు పచ్చ ,పసుపు వర్ణాలు కలిపి     వుంటుంది . తీపిగా,రుచిగా వుంటుంది.కోత పండు.

4) పెద్ద రసం: చిన్న వాళ్ళనుండి పెద్ద వాళ్ల వరకు యీ పండంతే పడి చస్తారు.కోతకు పనికి రాదు ,రసం జుర్రుకోవల్సిందే.

5) చిన్న రసం : మహాధ్భుత ఫలం పుట్టిన ప్రతి వాడు తిని చావ వలసిదే ఒక్క సారయినా.ఇదీ రసం జుర్రుకొనే పండే.పెరుగు అన్నం లోకి మహా   రంజయిన పండు.

6) చెరుకు రసం : ఇదీ రసం కోవలోనిదే అధ్భుతమైన రుచి.

7) పంచదార కలశం: ఇది బంతి లాగా గుండ్రంగా వుండి పసందయిన రుచి. ఇది కూడా రసం కోవకే చెందుతుంది.

8) కలక్టరు మామిడి: ఇది కూదా కోత పండే.

9) చిత్తూరు మామిడి : ఇది అన్ని రకాల మామిడి పళ్ళు అయిపోయిన తరువాత అందుబాటులోకి వస్తుంది.త్వరగా చెడి పోవు.ఇది కోత కాయ. పచ్చిది కూడా తియ్యగా వుంటుంది.
 
10)జొన్న రాసి మామిడి: ఇది పచ్చి గా వున్నప్పుడు పుల్లగా వుండి ,పండితే తియ్యగా రసంలా వుంటుంది . చిన్నసైజు  పండు. చెత్తుకు గుత్తులుగా వేలాడతాయి విపరీతంగా కాస్తుంది. అందుకే జొన్న రాసి అని పేరు.

11)జలాలు:ఇది గొప్ప వూరగాయ రకం. కండ  కలిగి బలమైన తెంక కలిగి ఆంధ్రులంతా యిస్ఠపదే పచ్చడి కాయ.కొంచెం లేటుగా మార్కెట్టుకు వస్తుంది. యెంత కష్ట పడయినా యీ కాయతోనె ఆవకాయ పెట్టాలని ఆంధ్రులు ఆశిస్తారు.

12) తెల్ల గులాబి : ఇదీ  కండ కలిగి ఆవకాయకు  బాగా పనికొచ్చే  రకమే. పందితే తియ్యగా వుంటుంది.

13) ఎర్ర గులాబి:ఇది కూడా వూరగాయకు మంచి మామిడి రకం.

14) సొర మామిడి : ఇది కోత కాయ. పచ్చిది కూడా తియ్యగా వుంతుంది.ఎక్కువగా పాకానికి వచ్చిన పచ్చి కాయ తింటారు.సైజు లో చాలా పెద్ద గా వుంటుంది.

15) కొబ్బరి మామిడి :ఇది కూడా కోత రకమే. పచ్చిదే ఎక్కువ యిష్ట పడతారు.

నాకు తెలిసి మరో ఇరవై అయిదు రకాల దాకా వున్నాయి కాని, యిప్పుడు గుర్తు లేవు . మీ కొరకు తెలుసుకొని తరువాయి భాగంలో   తెలియ పరుస్తాను. ఇవి నాకు తెలిసినంత వరకు మాత్రమే . యింకా చాలా రకాలు వుండడ  వచ్చు.  చిన్నప్పుడు అన్నీ గుర్తుండేవి. వచ్చిన బంధువుల దగ్గర  వాటి పేర్లన్నీ యేకరువు పెట్టే వాళ్ళం.వాళ్ళకు మా తోట చూపించే పని ,పిల్లలం మాకే అప్పగించే వాళ్ళు మరి.మామిది పళ్ళ రకాల గురించి మరికొన్ని వివరాలు మరో సారి చర్చించుకొందాము.

ప్రాకృతిక  సౌందర్యాలు 
నూతక్కి రాఘవేంద్ర రావు
తేది:26-04-2009
యూసమైట్ జాతీయ వనం (U.S.A )
 
ఆ లోయ ,పర్వతాలు ……
సుందర పర్వత సానువులు
మహోన్నత శిఖరాగ్ర శ్రేణులు
అత్యంత పురాతన శిలా తోరణాలు
అత్యున్నతాలు.. అగాధాల లోతులు
ఆ తారతమ్య సమ్మేళనం
ఆ లోయల సౌందర్య రహస్యం
ఆకాశపు ఆ అంచు నుండి ఆత్రంగా
జాలు వారు పెను జలపాతపు
వుగ్ర రూప సౌందర్యాలు
నిరంతర జలపాతపు శబ్ద తరంగాలు
ఆ నీటి తుంపరలు మది మదిలో నింపే
మధుర భావనలు. చిలిపి చేష్టలు
సెలయేరుల గలగలలు
నదీ నదాల వురవళ్ళు పరవళ్ళు
క్రూర మృగ జంతు శిలా
వృక్ష ఔషధ పర్వత
పరి రక్షిత ఛత్ర ఛాయ
సుసంరక్షిత జాతీయ నందనం
పరి శోధనావేశ పరుల
నిత్య సత్య త్యాగ ఫలం
కలియుగ దైవం
రచన :నూతక్కి రాఘవేంద్ర రావు
తేది :26-04-2009
పురాతన శిలలు ,శిఖరాలు
శిలాజాలు ,వున్నత పర్వతాలు
నిమ్నోన్నతాలు , జలపాతాలు
సెలయేళ్ళు,నదీనదాలు
పక్షి వృక్ష, జంతు ,సమూహాలు
ఓషధులు ,మహోన్నత వృక్షాలు
పరిపుష్టిత అరణ్య సమ్మిళిత ప్రపంచం
ఆ అద్భుత పర్వత లోకం …..
దివ్య  భవ్య  ధామం 
తిరుమలేశుని 
సన్నిధానం  
 

పాపం అభ్యర్ధులు (టిక్కెట్లు వచ్చినోళ్ళు..,రానోళ్ళు)

రచన: నూతక్కి రాఘవేంద్ర రావు dt.25-04-2009

 

ఏమిటో అనుకుంటాం కాని

అనుకున్నవన్నీ అవనిలోన

 అనుకూలంగా అవుతాయాని

 పాపం అది  నీ భ్రమ

 అర్ధం చేసుకుంటే

అనర్ధమే అసలుండదు

 అంచనాకు అందనిది

ఆంతర్యానికి దొరకనిది

 కృత నిశ్చయంతో

కృషి చేసినా,

ధృఢ సంకల్పం తో

 దీక్ష పూనినా

ధన రాశులు

 వేదజల్లినా

కండ బలం

 చూపించినా

గుండె నిండా

 ధైర్యమున్నా

 దండిగానీ చట్టూ

 నీ స్వంత బలం

అండవున్నా

 ఏమిటో మరి

అంతా అయి పోయిందని

 ఆనందంతో కేరింతలు

ఒక్క క్షణం

అయ్యో అంతా

అయిపోయిందే

ఆవేదనతో రోదనలు

మరు క్షణం

జీవితకాలం తృప్తిగా జీవిద్దాం
రచన: నూతక్కి రాఘ వేంద్ర రావు.
1976 వ సం . 
 
మనిషి  తనలో సహజంగా వుండే నేను అనే అహాన్ని పారద్రోలి ,త్యాగ నిరతిని పెంపొందించుకొని ,మనం , మనమందరం ,మనందరిదీ సమాజం,అనే వుద్దేశ్యం  వుధ్భవిన్చగా 
 
అధికం చేసిన సమాజావసర వస్తువుల వుత్పత్తిని సదవగాహనతో,సరి సమానంగా పంచుకొని,సమ సమాజాన్ని స్థాపించడం సహకారోద్యమ ముఖ్య లక్ష్యం.
అనాదిగా మానవునిలో సహజంగా వుండే కొపోద్రేకాలు,ఈర్ష్యాసూయలు, మద మాత్స్తర్యాల వల్ల  సంఘ జీవనంలో,అస్తవ్యస్త
పరిస్తుతులు నెల కొన్న తరుణంలో రాజరికాలు వచ్చి ,నియంతృత్వం చెలరేగి,ప్రజా వుద్యమాలకు కారణ భూతమయినాయి.
ప్రజా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి .
 
అటుపరి  పధ్యం  తీసుకొంటున్న రోగి అతిగా తింటే అజీర్తి చేసినట్లు …లభించిన  స్వేశ్చ స్వాతంత్య్రాలను సవ్యంగా వినియోగించుకోలేక, పెడ దారులు పట్టిన ప్రజానీకంలో
ధనవంతులు మరీ ధనవంతులై ,పేదలు  కడు పేదలవుతుంటే..వారి కడుపు కింత తిండి  పెడదామను కున్నప్రభుత్వాల ఆశయాలకు,ధనవంతులు అడ్డుగోడలై నిలువగా,
కాగితాలపై పెట్టిన సహాయ పధకాలు కార్య రూపం
 పొందేందుకు అవరోదాలేర్పడ్డాయి.
 
అట్టి దురదృష్ట కర పరిస్థితిలో తమలో తామూ ఒదార్చుకొంటూ,సహకరించుకొంటున్న ఈ నిరు పేద వర్గం దృష్టి,సహాకారోద్యమం వైపు
 
మళ్ళింది.కోన వూపిరితో వున్న ఈ వుద్యమ లక్ష్యానికి వూపిరి పోసి,,బతికించి పోషించడం జరిగింది.
 
సహకార పరపతి సంఘాలు,సహకారసేద్య సంస్తలు,సహకార పారిశ్రామిక వాడలు,సహకార భూ తనఖా బ్యాంకులు,వంటి,అనేక సంస్తలతో చిలువలు పలవలుగా పెరుగుతున్న
 
ఈ సహకారోద్యమ వృక్షం ,మధ్య మధ్య,
చీడపురుగుల బారి పడి,పెరుగుదల వేగం తగ్గి పోతోంది.
 
ఆయా చీడ పురుగులలో ముఖ్య మయినవి:…….
1) నిధుల దుర్వినియోగం,
2) పక్షపాత ధోరణి, బంధు ప్రీతి,
3) అంతు పట్టని లెక్కల పద్ధతులు,
4) నిధుల  నిర్వహణలో  సులభ  తరం  కాని  పద్ధతులు
5)సభ్యుల  భాద్యతా  రాహిత్య  చర్యలు ,  
 
ఇట్టి పరిస్తుతులలో  చెట్టు వ్రేళ్ళకే   చెదలు పట్టి  కూకటి వ్రేళ్ళతో కూలి పోకుండా …
పటిష్టమైన ప్రణాళిక 
నిర్దిష్టమైన పంపిణీ విధానం,
సక్రమమూ సులభ తరమూ అయిన పాలనా విధానమూ,
 
సంకల్పంతో సహకరించే యంత్రాంగమూ…., 
 
వంటి,   క్రిమి నాసిని మందులు వాడి …నిధుల సేకరణ అనే నీరు పోసి, ఈ మహా వృక్షాన్ని బ్రతికించి నిలబెట్టవలసిన భాద్యత మనందరిది.
 
అయితే రాజకీయాలనే గొడ్డళ్ళతో మొదలే నరికి వేయడానికి ప్రయత్నించే దుష్ట శక్తుల నుంచి, ఈ మహా వట వృక్షాన్ని రక్షించి,అట్టి
 కుస్ఛిత రాజకీయాలకు అతీతంగా ,నిస్వార్ధ నిష్పక్షపాత వైఖరి అవలంబించగల భాద్యతాయుత నిర్వాహకుల అవసరం ఈ సహకార
రంగానికి ఎంతయినా వుంది. . అట్టి వారిని ప్రోత్సహించి
 
వారికి అందదండలనందించ  వలసిన భాద్యత  సభ్యులందరి  పైనా వుంది.
 
ఇంతటి మహోన్నత ,మహోత్కృష్ట వుద్యమంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ- నిర్వాహకులు గానీ , కార్యకర్తలు కానీ, సామాన్య సభ్యులు
 కానీ, కార్య నిర్వాహక సిబ్బంది కాని,—-స్వార్ధ చింతన వీడి,తోటి వారినుండి,స్వలాభేక్షను మరచి తన సాయి శక్తులా యితరులకు
తోడ్పడాలనే ఆకాంక్షతో  ,ధృఢ చిత్తంతో ,నిస్వార్ధ భావనతో, పని చేద్దామని భావించినప్పుడు, ఈ మహా
వుద్యమం,మూడు పూవులు  ఆరు కాయలుగా వర్ధిల్లదా? ఆ ప్రయత్నంలో  మనలో కలిగే తృప్తి , ఆనందం చాలదా జీవిత కాలం తృప్తి
 గా జీవించడానికి?
                                                                       ——-
 

తర్వాత పేజీ »