నేనెలా చెప్పుకోను
రచన:నూతక్కి రాఘవేంద్ర రావు.
తేది : 23-05-2009
నేనెలా చెప్పుకోను
ఈ కవితను నేనే రచియించానని
ఈ భావం ఈ భాష ఈ పదాలు
అక్షరాలు వ్రాసే క్రమ విధాన భంగిమలూ
కనిపెట్టింది నేను కాదె
అక్షరం నేను కనిపెట్టింది కాదె
నేను పుట్టినప్పటికే వుందికదా
ఆ అక్షరాలు గుది గుచ్చిన పదాలు
పదబంధ మాలికలా వాక్యాలూ
నేను సృష్టించినవి కావే
నేను పుట్టేసరికే జనుల పెదవుల
నాట్యం చేస్తున్నావే కదా
భావాలు మనోజనిత వుత్ప్రేరితాలు
అన్నీ అప్పటికే బహిరంగ
వ్యక్తీకరణ లే
మరి నాకుగా నేను ఈ భాషలో
భావంలో భాష్యంలో
సృజియిన్చిన్దేముందని
వారూ వీరూ వేడి వేడిగా వాడుకొని
వాడి వాడి వదిలేసిన
వడి తగ్గిన
పదాలు యిటూ అటూ
కూరుస్తూ ఏదో గిలికి
పలుమారులు మారుస్తూ
భావాలను పలికిస్తున్నానని
మది లోలోతుల కులికి
నా మదిలో తిరుగాడే
వ్యధలను వెలిగ్రక్కాననుకొని
నా భుజం నేనే తట్టుకొని
సహభాష్ అనుకొని ….
అయినా ….
నేనెలా చెప్పుకోను …….
స్పందించండి