పోస్టు చేయని వుత్తరం -2
రచన: నూతక్కి రాఘవేంద్ర రావు
తేది :07-06-౨౦౦౯
 
డియర్ చిట్టీ ,
ఇక్కడ మేమంతా బాగానే వున్నాం .నీ గురించే  మా బెంగ. చాలా రోజులైనట్లుంది నిన్ను చూసి. మొన్నటి నీ ఫోను సంభాషణ తరువాత మీ అమ్మ కు బెంగ  మరీ ఎక్కువయ్యింది. నీ వద్దకు వెళ్లి వద్దామని వత్తిడి చేస్తోంది.
ఇక పొతే నీకు కొన్ని విషయాలు చెప్పాలి.
ఏమనిషయినా ఈ సమాజంలో ఒంటరిగా వుండలేడు. ఒక వేళ నీవు వుండ   గలిగినా సమాజం వుండ నీయదు. ,హర్షించదు. అందు చేత సాధ్యమైనంత వరకు మనం మన వ్యక్తిత్వాన్ని నిర్మించు కుంటూనే ,తోటి వారితో కలిసిపోతుండాలి. వారి సహకారం తీసుకొంటూ ఉండాలి   .వారికి అవసరమైనప్పుడు   మన సహకారమూ    అందించాలి .మంచి స్నేహితుల్ని పెంపొందించుకోవాలి. నీ మంచితనాన్ని ,నీ ఆప్యాయతను  అపార్ధం చేసుకొని అతిగా ప్రవర్తించాలనుకొనే వాళ్ళను ఆదిలోనే గుర్తించి దూరంగా వుంచడం  అలవారుచుకోవాలి. ఈ సమాజం ఓ అడవి లాటిది .జనారణ్యం.  సాధు జంతువులూ వుంటాయి, క్రూర మృగాలూ వుంటాయి . వ్యత్యాసాలు గుర్తించడం కొంచెం కష్టమే అయినా కాలక్రమేణా నీ అంతట నీవే గుర్తిస్తావు. ఒకరితో నాకేమని నీవు ఒంటరివైపోకు. నాకు వున్నదేదో తింటాను ఇతరులతో నాకేమి పని అని భావించడం …కొంత కాలమైతే ఫరవాలేదు గానీ ,
కాలక్రమేణా నీకు అవసరమైనప్పుడు నీ సహాయానికి ఎవరూ రారు అని నీవే గుర్తిస్తావు. . మనం, మన వ్యక్తిత్వం ఎంత ఘనమైనా ,సమాజంలో మేసలుతుంటేనే ,అన్ని సందర్భాలలో నీ వునికిని  నీదైన శైలిలో చాటుకుంటేనే ,కంపారిజన్ లో నీ వేమిటని నలుగురికీ తెలుస్తూంది. మనకూ ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. అందుకే మనలను మనం ఏమిటని నలుగురికీ చాటింపు వేయనక్కరలేదు కాని ,మనమేమిటో వ్యక్తపరచుకోవాల్సిన అవసరం  ఎంతయినా వుంది. ,మనకున్న ప్రతిభా పాటవాలు తెలియజేప్పుకోగల అవకాశాలు వచ్చినప్పుడు వెనకంజ వేయకుండా ముందుకు దూకడం , నిరూపించుకోవడం చాలా అవసరం. గెలుపూ ఓటమిల గురించి ఆలోచించకుండా పోటీలో పాలు పంచుకోవడం ఓ గొప్ప ప్రక్రియ. ఏ వ్యక్తికైనా. తనను తాను  వ్యక్తపరచు కోవడం గొప్ప కళ .మరో లేఖలో మరి కొన్ని విషయాలు. అమ్మ నాన్నలు చెప్పేవి ఏవీ అనుచితాలు కావు. అర్ధం చేసుకుంటే అనర్ధాలే రావు.  
 నీ జాగ్రత్తలు నీవే తీసుకోవాలి. ఇప్పటికి  వుంటాము నాన్నా,ఆశీస్సులతో ……నీ అమ్మ నాన్న