పోస్టు చేయని వుత్తరం-3
రచన :నూతక్కి రాఘవేంద్ర రావు
తేది: 08-06-2009
 
చిట్టీ,
ఇక్కడ మేమంతా క్షేమమే . నీ విషయాలు మొన్నటి నీ ఫోను తో తెలిసాయి , మొదటి సెమిస్టరులో ఏ బ్యాక్ లాగ్ లు లేకుండా పూర్తీ చేసుకున్నందుకు చాల సంతోషం. ఆ మధ్య నీవు వచ్చి నప్పుడు   మా ఆనందానికి
అంతులేదు. గాలిలేని కొట్లో నుంచి విడుదలై గుండె నిండా ఆక్సిజెన్ పీల్చుకున్నట్లుంది నిన్ను చూసినప్పటి మా పరిస్తితి. ఎంత చిక్కిపోయావు ? ఇప్పుడు మిక్కీ కూడా తిండి బాగానే తింటోంది .పాపం పిచ్చి ముండ నీ మీద బెంగ పెట్టుకున్నట్లుంది. మూగ జీవి చెప్పుకో లేదుగా.  దాన్ని ఎవరైనా కుక్క అంటే మాత్రం ( అది కుక్కే అనుకో ) నాకు చిర్రెత్తుకొస్తుంది.  అది సరే ,పిల్లలు కూడా ఎంత సంబర పడిపోయారో చూసావుగా.
ఇక పొతే ఇంతకు ముందు నీకు  రాసిన వుత్తరం లో మనలను మనం ఎక్ష్ప్రెస్స్ చేసుకోవడం గురించి వ్రాసాను. దాని గురించి ఇప్పుడు విపులంగా చర్చించుకొందాం.
మనలను మనం ,మన భావాలను మనం వ్యక్త పరచేతప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాల అవసరం. మనం ఎ రీతిలో మనలను వ్యక్తప్రచుకొంటున్నా అవెప్పుడూ దాంబికాలుగా కనపడగూడదు.అట్లాగని మనలను మనం తక్కువ చేసుకొనే ప్రయత్నం ఎప్పుడూ చేయ కూడదు. అవతలి వ్యక్తీ ఆసక్తి చూపే విధంగా నీ వ్యక్తీకరణ వుండాలి. ఆ వ్యక్తీకరణ తో ఎదుటివారు స్ఫూర్తి పొందాలి. ఎ సందర్భంలోనూ ఎదుటివారిని కించ పరచ గూడదు.
మనం చెప్పాలనుకున్నది ఎ తడబాతూ లేకుండా నిర్భయంగా నిర్దిష్టంగా సున్నితంగా వినయంగా చెప్పాలి.
 అంతే కాకుండా ఇతరులకు నిన్ను నీవు ఎ విధంగా వ్యక్త పరచావో  అదే విధంగా ఇతరులను అర్ధం చేసుకో  వాలన్నా , ఆకళింపు చేసుకోవాలన్నా ముందు అతను చెప్పేది శ్రద్ధగా పూర్తిగా వినాలి. అతను చెప్పేదాంట్లో సారం ఏమీ లేదనుకున్నప్పుడు ,సున్నితంగా చెప్పి తప్పుకోవాలికానీ ,అతని ముందు బయట పడకూడదు. మనం ఎస్కేప్ అవుతున్నామని అతనికి అర్ధం అవుతుంది కాని మన నోటితో మనం ఆ విషయాన్ని వ్యక్త పరచ కూడదు.
ఇది పెద్ద పెద్ద బిజినెస్స్ మెన్ రాజకీయ నాయకులు ,ఎక్జిక్యూటివ్ లు   వాడే టెక్నిక్. సాధ్యమైనంత తక్కువ మాట్లాడి ,అవసరానికి మించి విషయాన్ని యితరుల నుంచి రాబట్టటం ఒక ఆర్టు. మనం బయట పడకుండా ఎదుటివాడిని బయటకు రప్పించడం రాజకీయాల్లో ఓ ఎత్తుగడ.
ఇప్పటి వుంటాము  నాన్నా. ……ఆరోగ్యం జాగ్రత్త. శుభ్రంగా తిను. వుంటాము……అమ్మ నాన్న.