జీవశ్చవం .

రచన :నూతక్కి రాఘవేంద్ర రావు

తేది:21-07-2009

 

కళా తపస్వి యాతడు

 కళే ఆకారంగా

 కళే ఆహారంగా

 కళ్ళేక్కడో లోలోతుల 

కళ వెల వెల  పోతూ  

జీవం మాత్రం లేశం

కళేబరం నయం

కన్నీళ్ళతో దాహం తీర్చుక

కళ కోసమే ఆతడు   

కల్లోలిత మానవాళి లో

కాన రాని మానవతకై

కనులార్పక తపియించే

 మానవతా కళా తపస్వి

 కట్టెను నడిపేందుకు

 కళ నమ్ముకు బ్రతుక వలెనా ?

తను నమ్మిన జీవం

భావం భాగ్యం

కానీ …

కువ కువ లాడుతూ పిల్లలు

నక నక లాడుతూ పొట్టలు

 జీవం చచ్చిన కన్నులు

నిట్టూర్పుల సెగల పొగలు

 ఆకలి బాధలకోర్వని

జీర్ణించిన శరీరాలు ….

అమ్మకొరకు నాన్న కొఱకు

 కట్టుకున్న భార్య కొఱకు

బిడ్డల ప్రాణాల కొఱకు

అమ్మకుండా తప్పలేదు

 అంతిమంగ ఆ కళనే