పేరాశ
(అరువది ఏళ్ల  క్రితం  లోకం వీడిన అమ్మ తిరిగి వస్తుందని)
రచన :నూతక్కి రాఘవేంద్ర రావు
తేది :13-08-2009
 
నా జ్ఞాపకాల పొరల్లో
ఏ  మూలా  నిక్షిప్తమై లేని  
నీ రూపం కోసం
అనుక్షణం వెదుకులాడుతూ  
 క్షణ  క్షణం
నీ ధ్యాస, నీ స్మరణ  ….
 
అతి కొద్ది కాలం 
నా తనువును  తాకిన 
 నీ స్పర్శ తిరిగి పొందాలని 
తహతహ లాడని రోజు లేదు  
నీ కోసం  
నీరీక్షించని క్షణం లేదు  …..
ఆ రోజు నాకింకా గుర్తే
 
మా  పంతులు గారు
నేనేదో అల్లరి చేసానని
నా నెత్తిపైన మొట్టి తే
పొంగిన బొప్పి ని 
నీవు తడిమి తడిమి
నిమిరి నపుడు కలిగిన  
ఆ హాయి నాకింకా గుర్తే  
గట్టి పకోడీ మెత్తటి పకోడీ …అంటూ  
వైన  వైనాలుగా ఆ పంతులు
తొడపాయసం పెడితే ….
 కందిపోయిన  తొడపై
నల్లని ఆ నునులేత చర్మం 
చూస్తూ
చెమర్చిన నీ 
కనుకొలకులలో  
 నిండి  జారిన 
 నీరు చింది నా చర్మానికి
 వుపశమనమిచ్చి  
నా స్నానపు నును వెచ్చని
నీట  కలిసి  అతి వేడిగా
జాలు వారి….. 
అ క్షణాన నీ కన్నుల్లో 
 నీవు పడిన బాధ ను
నేను చూసిన   జ్ఞాపకాలు 
 
నీతో ఆడిన వూసులు 
నీ తో నడయాడిన జాడలు 
నీ  వడిలో  నే నాడిన క్రీడలు  
నీ వందించిన మురిపాలు
ముద్దులు,ముచ్చటలు
తినిపించిన గోరు ముద్దలు  
వర్షించిన ప్రేమ  ఝల్లులు
అన్నీ   నా స్మృతి యవనికపై
సజీవ చిత్రాలై కదలాడుతూ
 ఇన్నాళ్ళయినా
యిన్నేళ్ళయినా  
 
నను కన్న కొన్ని నాళ్ళకే   
కనులారా నను కనకే 
నా కంటి నిండ నిను  నే చూడకే
కానని లోకాలకు
ఏలనమ్మ నీ పయనం ?
 
తదనంతర  జీవిత  పర్యంతం 
అమ్మ
లేకుండానే  నేను
అవనిపైన  
అరువదేళ్ళు …….. 
 
అయినా
 
ఓ పేరాశ నాకు … 
చని పోయి
మము వీడిపోయి 
ఏ లోకపు
తీరాలన 
నీవున్నావో  
కాని ….
అమ్మ !
నీకు నీవే నను
వెదుక్కొంటూ
నా కొరకై  వస్తావని  !!
నీ  వడిలో  ఒక్క క్షణం  
తాదాత్మ్యతనందిస్తావని    !!!