సమంజస అసమంజసాలు.
రచన :నూతక్కి రాఘవేంద్ర రావు.
తెదీ :09-09-2009

ఎందరికో సమంజసంగా వుండే అనేక విషయాలు నాకెందుకో అసమంజసంగా వుంటాయి.ఆ విషయాన్ని బయటకు వ్యక్తపరిస్తే ఎవరైనా ఏమన్నా అనుకుంటారనే బెరుకుతో చిన్నతనమంతా గడిచిపోయింది.సమాజంలో మెజారిటీ కుటుంబాలలో పిల్లల్ని  క్రమ శిక్షణ  పేరుతో మాట్లాడనిచ్చే వారు కాదు.మా పిల్లలు మేంఎంత చెబితే అంత అని మీసాలు మెలేసే వారు . అంతే కాని వారి వారి  పిల్లలు ఎంతలా వ్యక్తిత్వాన్ని కొల్పోతున్నారో గుర్తించే వారు కాదు.

 
అసలు విషయానికి వద్దాం. నాకు సమాజంలో ,ప్రభుత్వ విధి విధానాలలో  అనేక విషయాలు అసమంజసంగా అనిపిస్తాయి. నేను   అసమంజసంగా భావించే  విషయాల్లో నా బుర్రను అతిగా తొలిచే విషయం ఒకటుంది.   అదేమంటే  ,మనది ప్రపంచంలోనే  గొప్ప ప్రజా స్వామ్యమని చంకలు గుద్దుకొంటూ చెప్పుకుంటాము కదా,ప్రజాస్వమ్యయుతంగా పార్లమెంటుకూ  , అసెంబ్లీకి ,వగైరాలకు ప్రతినిధులను రహస్య రీతిలో ఎన్నుకుంటాము కదా . అంటే   అసెంబ్లీకో , పార్లమెంటుకో ఎన్నికయిన ప్రతినిధులంతా ,ప్రజలకొరకు, ప్రజల చేత, ప్రజల అవసరాలు సాధించిపెట్టేందుకు  ఎన్నుకోబడిన వారే  కదా, వారంతా కలిసి,  రాష్ట్ర విధాన సభకు ముఖ్య మంత్రిని,పార్లమెంటుకు ప్రధాన మంత్రిని ఎన్నుకొనే అవకాశం దక్కకుండా యే ఒక్క పార్టీలోని యేకొద్ది మంది  సభ్యులకో ఎందుకు దక్కు తోంది?


మెజారిటీ వున్న పార్టీ ,కాబట్టి వారికే ఆ అవకాశం వుంటుంది, అదీ రాజ్యాంగం కలిపించిన అవకాశం అని మనకు మనమే సమాధానం చెప్పుకుంటాము.
కానీ ఒకే విధంగా ఎన్నికయిన ప్రతినిధులు యీ లెక్కల   గారడీతొ అధికార సభ్యులు, ప్రతిపక్ష సభ్యులు గా విభజింపబడుతున్నారు. ఆ విధంగా ప్రజాస్వామ్యం ముక్కలవుతున్న భావన ఎవరికీ ఎందుకు కలగడం లేదో నాకు విస్మయం కలిగించే విషయం.   ప్రజల క్షేమం  కొరకు వారి ప్రయోజనాలు నెరవేర్చేందుకు, సమాజంలోని వ్యత్యాసాలను  తొలగించే దిశగా వాగ్దానాలు చేసి ఎన్నికై వచ్చిన,  ప్రజాప్రతినిధులైన ఎంపిలకు,ఎమ్మెల్యేలకు, ఆయా సభలలో అధి నాయకుడిని నియమించుకొనే హక్కు వుండాలి కాని ,యే కొద్ది మందో ఎక్కువ సభ్యులను గెలిపించుకున్న పార్టీకి ఆ హక్కు దఖలు కావడం ప్రజా స్వామ్యం అనిపించుకోదు. వోటరు తను వేసిన వోటు, అధికారం పొందిందా లేక ప్రతి పక్షమై పోయిందా అని ఆలోచించినపుడు గెలుపు గుర్రానికే వొటు వేసే సంస్క్రుతి పెంపొంది  చివరకు ప్రజాస్వామ్య మూల సూత్రాలే చ్ఛిద్రమయ్యేందుకు కారణభూతుడై, ప్రజాస్వామ్యం నిర్వీర్యమై పోతుంది.
ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధి పార్టీలకు అతీతంగా ముఖ్య మంత్రినో ,ప్రధాన మంత్రినో ఎన్నుకొనే సువర్ణావకాశం కొరకు ,ఆ హక్కును సాధించుకొనేదిశగా వుద్యమించి, అందుకు ఆచరణయోగ్యమైన మౌలిక సూత్రాలను కూడా సూత్రీకరించుకొని వుద్యమించ వలసిన అవసరం ప్రతి ఒక్క పౌరుడికీ ఎంతయినా వుంది. తస్మాత్ జాగ్రత!!!

           

ప్రకటనలు