భారత దేశపు నాణేలు,  కరెన్సీ నోటులు ,  స్వతంత్రానికి  ముందు ,తరువాత
రచన:నూతక్కి రాఘవేంద్ర రావు.
తేదీ: 13-09-2009 

 దమ్మిడి,కాణీ,అర్ధణ (అర్ధ అణ),అణ ,బేడ,పావలా ,అర్ధ రూపాయి ,రూపాయి ,దమ్మిడి ,కాణి,అర్ధణా, అణా,బేడ, వీటి గురించి ఎప్పుడైనా విన్నారా? అవేంటో అసలు  మీకు తెలుసా ?  ఓకే –ఓకె …తెలిసుంటే  సరే తెలియకపోతే అవేంటో యిప్పుడు తెలుసుకుందాం సరేనా ?అవన్నీ మన నాణేలే.మెట్రిక్ ప్రమాణాలలో నయా పైసల కరెన్సీ  1957 లో ఆవిర్భవించి వాడుకలోకి వచ్చే వరకు ,ఆ తరువాతకూడా  చాలాకాలం వరకు సమాంతరంగా మన భారత ఆర్ధిక వ్యవస్తలో చలామణీలో వున్న నాణేలు ,కేవలం నాణేలే కాదు,సామాజికంగానూ , సాహితీపరంగానూ, వ్యావహారికంగానూ, జీవన రీతుల్లో జీర్ణించుకు పోయిన మహత్తర వ్యవస్త. .   
మూడు దమ్మిడీలు ఒక కాణీ ,రెండు కానులు ఒక అర్ధణ,నాలుగు కానులు ఒక అణా.
పదహారణాలు ఒక రూపాయి .

 
రూపాయి నాణెం ఒక తులం వెండి తో చేసేవారు.
దమ్మిడీలు ,కానులు,(కాణీ కి బహువచనం కానులు.పొరబాటున కాసులని అనుకునేరు) రాగితోనూ, అర్ధణాలు ,అణాలు , బేడలు ,రాగి ఇత్తడి – లోహ మిశ్రమం తోనూ, పావలాలు ,అర్ధ రూపాయి నాణాలు నికెల్ లోహ మిశ్రమం తోనూ చేసే వారు. వీటి అన్నిటి పైనా ఒక ప్రక్క ఆయా సమయాలలో బ్రిటీష్ సామ్రాజ్యాన్ని పాలించే చక్రవర్తి చిత్తరువులు ముద్రించి వుండేవి. రెండో ప్రక్క నాణెపు విలువ తెలియ చేసే ముద్ర వివిధ భాషల్లో వుండేది.
దమ్మిడీ అప్పటి నయా పైసా సైజులో రాగితోనూ ,కాణీ రాగితోనే చేయబడి రెండు మూడు రూపాల్లో చలామణిలో వుండేవి.

చిన్న కాణీ ,చిల్లు కాణీ , పెద్ద కాణీ .విలువ ఒకటే కాని,  రూపాల్లో తేడా. చిన్న కాణి మీద చక్రవర్తి బస్ట్ సైజు బొమ్మ కిరీటంతో సహా వుండేది. చిల్లు కాణీలో కిరీటం మాత్రమె వుండేది. పెద్ద కాణి లు కొన్నిటిలో కిరీటం లేని బోడిగుండు చక్రవర్తి బొమ్మ వుండేది. కొన్నిటి పైన కిరీటం వున్న జార్జి చక్రవర్తి బొమ్మ (అనుకుంటాను)వుండేది.
అర్ధణా, నాలుగు పలకలుగాను, అణా పాత పది పైసల నాణెం లా  గుండ్రంగా ,అంచు మొత్తం  గగ్గులతొ  చిన్న సైజులలోనూ వుండేది. బేడ, నాలుగు పలకలతో నూ, పావలా నాణెం యిప్పటి పావలా లా గుండ్రంగా వుండేది . (దాని పైన వుండే బొమ్మ,యితర వివరాలు తప్పితే,) .
అలాగే ,అర్ధ రూపాయి ,రూపాయి నాణేలు కూడా ఆ మధ్య కాలం నాటి పెద్ద సైజు , యాభై పైసల,  వంద పైసల  నాణేల సైజులో వుండేవి. ఇప్పుడంటే మన రూపాయి నాణేల సైజు చాల చిన్నగా  అర్ధ రూపాయి సైజులో వస్తున్నయి కాని,  వంద పైసల రూపాయి బిళ్ళ  మాత్రం అప్పటి   భ్రిటిష్   రూపాయి సైజులోనె  వుండేది .
1957 వ సంవత్సరం  నుండి స్వతంత్ర భారత ప్రభుత్వం తన స్వంత ముద్రలతొ నాణేలు ముద్రించడం ప్రారంభించింది .నయా పైసా,అన్నిటికన్న తక్కువ విలువ కల నాణెం.రూపాయిలో వందో వంతు.    జవహర్లాల్ నెహ్రు, మహాత్మ గాంధి  ,మూడు సిం హాల   గుర్తు ల తొనూ  యీ నాణేలు వుంటాయి.
అప్పటి రూపాయి నొటు  యిప్పటి రూపాయి నోటు   వలెనే   వుండి, బొమ్మలు, వివరాలు వేరు గ  వుండేవి. యిప్పుడేమొ  వంద పైసలు అని వుంటే అప్పటి   రూపాయి నోటు పై  పదహారు అణాలు అని వుండేది.
రూపాయి ,రెండు రూపాయలు ,,అయిదు రూపాయలు, పది రూపాయలు, వంద రూపాయల నోటులు   వుండేవి .ఇరవై ,యాభై రూపాయల నోటులు   వుండేవి కావు.

ఇక పోతె,  స్వతంత్ర భారత దేశంలొ   విలీనం కాకముందు నిజాం
 ప్రభుత్వంలో వేరే నాణెలు వుండేవి.వాటి కొరకు వాడే లోహాలు, రూపాలు ,పేరులు వేరుగా వుండేవి.  
 
(Pl.Note: యీ విషయాలపై మీకు ఆసక్తిని కలిగించాలనే నా యీ ప్రయత్నంలో ,యిక్కడ పొందుపరిచిన  వివరాలు ఏవైనా  ,వాస్తవ ప్రమాణాలకు సరితూగ  లేదని మీరు  భావించినా ,అసంపూర్ణంగావున్నాయని మీకు  అనిపించినా ,  మరిన్ని వివరాలు మీలో ఎవరికైనా సోదాహణంగా తెలిసి వుంటే, నాకు ఆయా వివరాలు వివరణలతో అందించ గలరు. ఆయా నాణేల చిత్తరువులు అందుబాటులో  వుంటే   పంపించ గలరు.  .  . రచయిత    )     
      
ప్రకటనలు