నిస్వార్ధంగా నిరంతరంగా

(గ్రహాలే విధులు మాని తమ గతులు తప్పితే!!!)

 రచన:నూతక్కి రాఘవేంద్ర రావు.

తేది:24-09-2009

 కవులెందరో కవనారీతులెన్నో

రచయితలెందరో

రచనావైవిధ్యాలెన్నెన్నో

 సామాజిక చిత్రణలో

 వాస్తవాలు వెలువరించి

మంచి చెడుల విశ్లేషణ…..

ఏమిటో తమ తీరే గొప్పని ప్రతివారూ…..

చిత్రకారులెందరో

చిత్ర రచనా తీరులూ

చిత్రిత వైచిత్రులు

ఎన్నో ఎన్నెన్నో ….

గాత్రకారులెందరో

గానమాధ్యమాలెన్నో

 గానరీతులు మరెన్నో

 మానసిక వుల్లాసం

 కలిగించే ప్రక్రియలో …….

అదేమిటో!!!

తమ తీరే గొప్పని ప్రతివారూ…..

 వైద్యం వ్యవసాయం

యంత్రాగారం శాస్త్రగ్నానం

రాజకీయ పార్టీలు నాయకులు

జనజీవన సంవిధాన

ప్రక్రియలో నియంత్రణలో…..

 అదేమిటో!!!

తమ తీరే గొప్పని ప్రతివారూ…..

 దేవుళ్ళు దేవుడిగుళ్ళు

మసీదులు చర్చిలు

సిక్కులు బౌద్ధులు

 జైనులు పార్సీలు

 వైవిధ్యం ఆధ్యాత్మికం

 అదేమిటో!!!

తమ తీరే గొప్పని ప్రతివారూ ……

కానీ కానీ కానీ ……

జానపదులు

జీవనదులు

 జంతుజాల

జలజీవన

 వైవిధ్యం…

పశుపక్షులు

పర్వతాలు

అరణ్యాలు….

నేత్రపర్వ సంగీతం

 సూర్యుడు చంద్రుడు

గ్రహరాశులూ,

దివారాత్రములు,

 వివిధరుతువులు

 జీవజాల సర్వోన్నతికై

సర్వ జగతి సంరక్షణకై

నిస్వార్ధంగా నిరంతరంగా

 ఏమో…. ఎన్నడైన

తమ లో తాము పోటీపడి

 తాము గొప్ప తామే గొప్పని

మనిషి నుండి నేర్చుకొని

స్వార్ధం జీర్ణించుకొని

విధులు మాని

గతులు తప్పితే !!!!