రోలు రోకలి

( అప్పట్లో యింట్లో దీపావళి కి మేమే తయారు చేసుకున్న  టపాసులు)…1

 రచన: నూతక్కి రాఘవేంద్ర రావు.

తేది:17-10-2009

దీపావళి కి యీ రోజుల్లో అందుబాట్లో వున్న, తుపాకులు, తుపాకి బిళ్ళలు, ప్లవర్ పాట్స్, (కాగితపు చిచ్చు బుడ్లు) ఫ్లవర్ పెన్సిల్స్ ( మతాబులు ) వినియోగంలోకి రాని 1950-1970- సం.రాల మధ్య కాలమది,రోలు,రోకళ్ళు ,గంధకం పొటాషులతో,శబ్దాలు శ్రుష్టించే వాళ్ళం. (రోలు రొకలి బొమ్మ యిక్కడ ఎటాచ్ చే్సే సదుపాయం నాకు అందు బాటులోలేక యివ్వ లేక పోతున్నాను.) తలుచుకుంటే యిప్పటికీ నాకు అనిపిస్తూ వుంటుంది….అలాటి పదార్ధాలను పిల్లలకు ఎలా అందుబాట్లోకి రానిచ్చేవారోనని.

రోలు ఆకారం లో పొతపోసిన చిన్న యినప తొట్టె, రోకలి ఆకారంలో క్రింద కొన దేరి ,పొత పోసిన యినప ముక్క, వాటి వెనుక లో బలమైన ,తీగ బిగించడానికి, బెజ్జాలు. ఒక లావు పాటి జి.అయ్ వైరుకు ఒక ప్రక్క రోలు, (అటు,యిటు కదలటానికి వీలుగా )మరో ప్రక్క రోకలి, ఒక దానిలో ఒకటి యిమిడేలా అమర్చిఒక మూరెడు పొడవుండెలా గుప్పెట్లో అమరేలా వైరు యేర్పాటు చేసుకొని, పొటాషు(రసాయనిక నామం పొటాషియం క్క్లోరైడు అనుకుంటా సరీగ్గా తెలియదు), ఎక్కువ వత్తిడి కాకుండా, గంధకం విడి విడిగా నూరుకొని, విడి విడి డబ్బాలలో పోసుకొని , చిటికెడు లో సగం సగం (సమపాళ్ళలో) రెండు పొడులూ రోటిలో వేసి రోకలి, రోకట్లో బిగించి తీగ చివర పట్టుకొని రోకలి క్రింది వైపు కు పెట్టి బలంగా కనక ఏదయినా బండ మీద కొడితే లక్ష్మీ బాంబు కన్నా భయంకర మైన మోత పుడుతుంది.

గంధకమ్ ఎక్కువైతే పొగ ఎక్కువ ,మోత తక్కువ. పొటాషు ఎక్కువైతే మోత మంట యెక్కువ, పొగ తక్కువ ,వచ్చేవి. యీ సాధనాలు అన్ని కిరాణా దుకాణాల్లోనూ లభించేవి. కలిపిన పొడి కూడా ఒక్కొక్క మోతదు పొట్లాలు కట్టి లభించేవి. జాగ్రత్తలు తీసుకోకపోతె మాత్రం, యీ ప్రక్రియ చాల ప్రమాదకరం.అందుకే పెద్ద వాళ్ళపర్యవేక్షణలోనే వుపయోగించేవాళ్ళం.

పొరబాటున గంధకం పొటాషు కలిపి నూరినా, ఒక్క పొటాషుకే ఎక్కువ వత్తిడి తగిలినా,భయంకరంగా ప్రేలుతుంది. చేతులు, వ్రేళ్ళు, కళ్ళు ముఖం చాతీ కాలి పోవడం జరుగుతుంది. నేను దీపావళి సమయాలలో నా స్వంతంగా చేసిన ప్రయోగాల్లో అనేక పర్యాలు అలాటి అనుభవాలు పొందాను.యిలాటి పెద్ద ప్రమాదాలనుండి లక్కీగా బయట పడిన అనేక సంఘటనల్లో., నుండి యేదో అలా బ్రతికి బయట పడ్డాను కాబట్టే యిలా మీకీ జాగ్రత్తలు చెప్పడం.

మతాబులు, చిచ్చుబుడ్లు,దీవిటీలూ, అవ్వాయి చువ్వాయిలు, యివన్నీ కూడా యింట్లోనే తయారు చేసేవాళ్ళం. వాటి తయారీ విధానాలు మరో టపాలో. అలా అని మీరు తయారు చేసుకోమని కాదు.