బందులొద్దు బిడ్డా!

రచన :నూతక్కి,

 తేదీ: 31-12-2009

బందులొద్దు బిడ్డా

నీవు తెస్తనంటె తెయ్యి గని

తెలంగాన తెస్తనంటె తెయ్యి గని …..

కూర లేదు నార లేదు

 పొయ్యికింద నిప్పులేదు

పైకి తేను పైసలేదు,

పనివున్నా పోనీకి లేదు

బందులొద్దు బిడ్డా,నివు

తెస్తనంటె తెయ్యిగని

తెలంగాన తెస్తనంటే తెయ్యిగని

 పనికి పోక పైసరాదు ….

పైసలుండి గూడ నాకు

 పప్పుప్పులు దొరకై గద

ఎన్ని దినాలాయె నేను

 పాని పూరి బండి బెట్టి

ఎన్ని దినాలాయె నా

 బడ్డీకొట్టుకాడికెల్లి

ఎన్ని దినాలాయెనో

నా సెప్పుకుట్టె షాపు దెరిసి

ఎన్ని దినాలాయెనో

పంచరేసె సాపు తెరిసి

నెలకొక్కటి బందెట్టుకొ

అదిభీ ఓ ఆదివారం

 బందులొద్దు బిడ్డా,

నివు తెస్తనంటె తెయ్యిగని

 తెలంగాన నివు తెస్తనంటే తెయ్యిగని

 మా బతుకుల్తో ఆడుకోకు

మా కడుపులతోఆడబోకు

 పిలగాళ్ళ ఇసుక్కూళ్ళుబాయె

సదువులన్ని సంకనాకె

జలుబొచ్చిన జబ్బొచ్చిన

 డాకటర్లు దొరకరాయె

 నీరసంగ జస్తున్నా

 జాలి రాద బిడ్డ నీకు

బందులొద్దు బిడ్డా,

నివు తెస్తనంటె తెయ్యిగని

 తెలంగాన నివు తెస్తనంటే తెయ్యిగని

 మా బాగోగులు సూడకుంట

 గిట్లనే నువు జేసుకుంట

దిన దినాం బందంట

 మా కడుపుకింత కూడులేక

సస్తున్నాం సూడు బిడ్డ…

బందులొద్దు బిడ్డా,

నివు తెస్తనంటె తెయ్యిగని

తెలంగాన నివు

 తెస్తనంటే తెయ్యిగని