డిసెంబర్ 2009


హమ్మయ్య !!!

 రచన:నూతక్కి ,

Dt: 21-12-2009

 హమ్మయ్య ! అని

ఆ రోజునా నిట్టూర్పు

 విడిచాము

అతడు ఆమరణ దీక్ష

విరమించాడని విన్నపుడు

 యీ రోజూ అదేనిట్టూరుపు

 యీతడూ క్షేమమని

తెలిసినపుడు జరగబోయే

వుపద్రవం కొంతైనా

తొలగిందని ….

అద్రుశ్యం !!!

 రచన : నూతక్కి

తేది: 20-12-2009

 వుద్యమిస్తున్న సూర్యుడు

అర్ధరాత్రి అంధకార నిశీధిలో

అర్ధంతర అనూహ్య అంతర్ధానం

 అనేకానేక సందేహాల

 స్థైర్య విహారం

 రక్షకభట విక్రుత విన్యాసమా?

 ప్రభుత్వ కుటిల వ్యూహమా?

 స్వీయ వ్యూహ కౌశలమా?

అంతరంగ మధనంలో

అనుయాయుల

ఆత్మీయుల

ఆందోళన! ఆక్రందన ! …..

ఆక్రోశపు వేదనలో

వలలు విసురుతూ

 రాష్ట్రం నలు దిక్కులా

రక్షకభట వర్గం

 
ద్రుతరాష్ట్ర కొలువులోగాంధారి చిద్విలాసం

  

రచన: నూతక్కి
  
  
 నాశనమౌతున్నా,యువత భవిత,
 

రాష్ట్రం రణరంగమై రక్తపుటేరులు 

పారుతున్నా ,ప్రాణాలే పోతున్నా, 

చోద్యంచూస్తూ,చిరునవ్వులు చిందిస్తూ 

చట్ట సభలో కళ్ళు తెరచి చూస్తూనే 

యింకా 

గంతలలోనే గాంధారి. 

తేదీ:19-12-2009

 

  

  

బ్యాక్ సీట్ పైలటింగ్.

 రచన :నూతక్కి

 Dt:17-12-2009

 బొమ్మముఖ్యమంత్రి, బొమ్మప్రధానమంత్రులను పెట్టి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ….పర్యవసానం రాష్ట్రమంత అగ్ని గుండం..

ఎప్పటికెయ్యది ప్రస్తుత మప్పటికా మాటలాడి…….అన్నట్లు వాళ్ళిమ్మని చెప్పారు కాబట్టి, యిచ్చేస్తున్నామని చెప్పాం ,వాళ్ళిప్పుడు మోసం చేశారు,మాట తప్పారు.ఇది న్యాయమా?

యివ్వకపోతే అతడు చస్తాడేమోనని భయపడి యిచ్చాం.మాట తప్పారు.

మరిప్పుడు అక్కడా చచ్చేట్లున్నారు.అక్కడ చస్తున్నప్పుడు వాళ్ళ కోరిక ప్రకారం వాళ్ళకీ మాటిస్తే అక్కడి అగ్ని జ్వాలలు తగ్గుతాయికదా,

అలా సోనియమ్మమాట తప్పే మనిషికాదు.ఆమె యిచ్చిన వాగ్దానం తీర్చింది

యిదీ కాంగ్రేసు అధినాయకులు కేంద్రంలో ఎవరికి వారు చెప్పే మాటలు.

యిందులో నాకర్ధం కాని దల్లా యిందులో సోనియా పాత్ర యేంటి? సొనియా దెశాన్ని పాలిస్తోందా, యీ దేశంలో పార్టీల అద్యక్షులకున్న అధికారాలు, ఎన్నుకో బడ్డ ప్రభుత్వాలకు వుండవా? యితర పార్టీలు కూడా అధికారంలో వున్న పార్టీల అద్యక్షులకే తమ తమ పార్టీల డిమాండులు ఏకరువుబేడితే సరిపోతుందా?

ముఖ్య మంత్రీ, ప్రధాన మంత్రీ బొమ్మలేనా?

ప్రధాన మంత్రి , అతనేమి చేస్తాడబ్బా?భారత దేశపు రాజకీయాలలో అతని ప్రాముఖ్యత అస్సలేమీ వుండదా? అతని మంత్రివర్గం కూడా వుండాలికదా? అధికారం పొందిన పార్టీ అధ్యక్షులకు రాష్ట్రాలను చీల్చగలిగే అధికారాలుంటాయని కొత్తగా వింటున్నా.రాజ్యాంగం మార్చారా యీమధ్య? వీళిమ్మన్నారని, వాళ్ళేడ్చారని, ఇంకెవడొ చస్తాడని ,అంతేగాని,మనం ప్రజాస్వామ్య డేశంలో ప్రజలకు ప్రతినిధులం. అతి సున్నిత విషయం లో ప్రజల అభిప్రాయం ప్రజాస్వామ్య యుతంగా తీసుకుందామని కాని,పార్లమెంటులో పెట్టి వారి అభిప్రాయం ప్రకారం యివ్వాలో వద్దో తేల్చుకొని ఆ ప్రకారం ప్రక్రియ ప్రారంభింద్దాం అని కానీ, కనీస యింగితమింతైనా లేకుండా,పర్యవసానాలను ,ఇతరప్రాంత ప్రజల ఆత్మాభిమానాలను, ఆత్మ గౌరవాలను త్రుణ ప్రాయంగా భావించి, కేంద్రానికి ఎన్నికైన రాష్ట్ర ప్రతినిధుల్నిగానీ, ఆకేంద్ర ప్రభుత్వంలో వున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులను కానీ సంప్రదించకుండానే, పరిస్తితి తమచేతులు దాటిపోతాయేమోనని, రాష్ట్రం పంచితే మనకేం లాభం? లేకుంటే మనకేమి నష్టం లాటి విషయాలు సడెన్ గా గుర్తొచ్చి  

తూకమేసిచూసుకొని,

యితర పర్యవసానాలూ లెక్కేసుకొని ,మహా అయితే ఆంధ్రలో నాలుగైదు రోజులు గొడవలు చేసి సర్దుకుంటారు.లేకుంటె ఒ పదిమంది చస్తారు. అంతేగా… మనకు పోయిందేముంది . అని అంచనాలేసి,చుట్టూ వున్నభజనగాళ్ళతో అర్ధరాత్రికి రాత్రి తెలంగాణ డిక్లేర్ చేయించిన నిక్రుష్ట రాజకీయం సోనియాది.యిరు ప్రాంతాలలో పలువురి ప్రాణాలు పోవడానికి కారకురాలు సోనియా.( వెనుక ఎవరి ప్రోద్బలమైనా వుండి వుండొచ్చు కాక.) అంత ప్రేమే తెలంగాణ పై వుంటే ఎప్పటినుంచో అడుగుతుంటే ఎందుకివ్వలేదు?ప్రజాస్వామ్య పధ్ధతులెన్నో వుండగా అసంబద్ధ విధానాలెందుకు?దేశానికే అధినాయకురాలైట్లు వ్యవహరించి ,యిప్పుడు తన మాట వెనక్కు తీసుకొంటే పరువు పోతుందన్నట్లు,ప్రజల ప్రాణాలతోనూ, భావి యువకుల జీవితాలతోనూ ఆడుకోవడమెందుకు?రాష్ట్రాన్నియిరు ప్రాంతాలలోనూ, అగ్నిగుండం చేయడం యెందుకు?విచక్షణ కోల్పోయివ్యవహారం చేస్తే,విగ్నత లోపిస్తే,పర్యవసానం ఎలా వుంటుందో, ఆంధ్ర, రాయల సీమల్లో, రగులుతున్న అగ్నిగుండం, లేకుంటే, తెలంగాణా లో జరుగబోయే వినాశనం,…యిదంతా సోనియా వల్ల జరిగిన బ్యాక్ సీట్ పైలటింగ్ విపరిణామం.దేశ ప్రజలకు భవితకు జరిగిన విఘాతం.

సమఝ్దారెవడు?   

రచన: నూతక్కి

తేదీ: 17-12-2009
 
రందిలేపి గుంజల్కూడగట్టి
సెంటరుకాడికెల్లి షామియాన దెచ్చి

పందిరేసి అందల

సల్లంగ పండి సిద్విలాసంగ

జూస్కుంటా ఆడు……..

తమకు తామె

రందిపడ్డ గుంజలు

పందిర్నిగూల్చ జూస్తె

కూలకుంట తపనపడి

పాట్లు పడత యీడు

 

సంక్షోభంలో సంక్షోభం

 రచన: నూతక్కి

తేదీ:15-12-2009

 త్రిదశ వత్సరాల

తెలుగు దేశం పార్టీ

ప్రాంతీయతా భావనల

 విభజనా వీచికల

సంకేతాల సంక్షోభం

స్వయంక్రుత అపరాధమా ?

 ద్వైధీ భావనా వేదనలు

 అధినేత రచియించిన

చాణక్య తంత్రమా ?

చారిత్రిక తప్పిదమా?

రాజకీయ వైఫల్యమా?

రాజనీతి వ్యూహమా ?

 అస్థిర పరిణామ

నేపధ్యపు విక్రుత

 మానసిక విన్యాసమా?

 స్థిర దీక్షా సంకల్పమా?

అర్ధం కాక అడుగుతున్నా

సమిధలు,

 రచన: నూతక్కి,

తేది:14-12-2009

రాజకీయ నాయకులు

రగిలించిన అగ్ని జ్వాల

 వుద్రిక్తతా కాంతివైపు

ఆకర్షితులై పరువులు

 రగులుతున్నగుండంలో

సమిధలవుతు భావి జనత

 అటు యిటు ఎటునుండైనా

 అమాయకులా ప్రాణులు

వుద్యమస్ఫూర్తితో 

 విచచ్ఛణా రాహితీలో……

కుచ్చిత రాజకీయానికి సుహ్రుధ్భావ పరిష్కారం

రచన: నూతక్కి

తేదీ: 11-12-2009

ప్రస్తుతం రాష్త్రం లో వున్నఅస్తవ్యస్త పరిస్థితులలో 

వివిధ ప్రాంతాల వారు ఒకరికొకరు నిందించుకుంటూ ద్వేషభావాలు పెంచుకుంటూ క్రోధాగ్ని రగుల్చ్కుంటూ పోకుండా,

ఆంధ్ర,రాయలసీమ, వాసులు,తెలంగాణ వారిపై ద్వేష భావంతో కాకుండా, 

సానుభూతితో విశాల హ్రుదయంతో, విగ్నతతో ఆలోచించి విధ్వంసాలు ఆపి, విద్యార్ధులు విద్యా సంవత్సరం నష్ట పోకుండా, భవిష్యత్తును ద్రుష్టిలో పెట్టుకొని ,భావితరాలవారికి భవ్యమైన,మరో రెండు రాష్ట్రాలు యేర్పరుచుకొని, వాటికై మరో రెండు అధునాతన రాజధానీ నగరాలను కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మింప జేసుకొని, జరిగిన దానికొరకు అనవసర ఆందోళనలు వీడి,ఒకరికొకరు స్నేహ హస్తాలు అందించుకొంటూ,ఆనందమయ జీవనం గడప వచ్చు. అయితే అప్పటి వరకు రాష్ట్ర విభజన జరుగ రాదన్న,నియమానికి కేంద్ర ప్రభుత్వం వప్పుకోవాలి.క్రొత్త రాజధానీ నగరాలెక్కడ యేర్పాటు జరుగుతుందో తెలియ చెప్పాలి.  అందరికీ ఆమోదయోగ్యమైన సరికొత్త ప్రదేశాలను నిర్ణయించి ఆ నగరాలను నిర్మించాలి.పాత నగరాలలో యేర్పాటు చేయరాదు.

 అందుకు పరిష్కార మార్గాలు : 

కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ,యీ క్రింది విధంగా, రెండు రాష్ట్రాలను సాధించుకొంటే ఎవరికి వారు వారి వారి ప్రాంతాలలో నిశ్చింతగా వుండ వచ్చు.అందువల్ల ,రాయలసీమ వారి కీ,కోస్తావారికీ, వుత్తరాంధ్ర వారికీ, తెలంగాణావారికీ వారి వారి హక్కులు సాధించుకున్న మనో త్రుప్తి కలుగుతుంది. త్రిలింగ దేశమైన తెలుగుల దేశం త్రైయ్యాంధ్రగా మూడు రాష్ట్రాలు సుహ్రుద్భావాలతో, సొదర భావంతో కలిసి మెలిసి వుండవచ్చు.

 1) అప్పుడెప్పుడో కోల్పోయిన రాజధాని  కర్నూలు గురించి ఆక్రోశ పడకుండా  చింతించకుండా,

మరో రెండు రాష్ట్రాలు, మరో రెండు రాజధానీ నగరాలు,హైకోర్టు, సెక్రటేరియేట్,యితర ప్రభుత్వ భవనాలు,ఎయిర్ పోర్టులు, నిర్మించి  యివ్వాలని కేంద్రాన్ని కోరాలి

మరో రెండు వందల సంవత్సరాల వరకూ మార్చవలసిన అవసరం రాని అధునాతన,నవీన వనరులతో రెండు రాజధాని నగరాలను, ఒకటి గుంటూరు జిల్లా నైరుతీ ప్రాంతంలోకాని, దగ్గరలోని రాయల సీమజిల్లాలోకానీ,మరోకటి కాకినాడ ప్రాంతంలోనూ ,ఒక్కొక్కటి వంద చదరపు మైళ్ళ వైశాల్య లో  నిర్మించాలి.

 2)క్రిష్ణానదికి వుత్తరాన వున్న జిల్లాలతో వుత్తరాంధ్రనూ,

3) క్రిష్ణా నదికి దక్షిణంగా వున్న గుంటూరు,ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలూ రాయలసీమ జిల్లాలనూ కలిపి దక్షిణాంధ్ర గానూ ……….,

రెండు రాష్ట్రాలను యేర్పాటు చేయమని కేంద్రాన్ని అడగాలి .ఆ ప్రక్రియ మొదలైన తరువాతనే విభజన జరగాలి.

4) లోగడ ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణ జిల్లాల్లో కలిపిన ప్రాంతాలను తిరిగి ఆంధ్ర ప్రాంతంలో కలపాలి. యితర రాష్ట్రాలలో కలిపిన తెలుగు ప్రాంతాలను ఆంధ్ర ప్రాంతానికీ ,తెలంగాణాకీ కలపాలి. కేంద్రపాలిత ప్రాంతంగా వున్న యానాం ను వుత్తరాంధ్రలో కలపాలి.

 5) భాగ్యనగరంలో వున్న విధంగా ,కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలొ,పెద్ద పెద్ద పరిశ్రమలు ఆంధ్ర రాయలసీమలలో వివిధ ప్రాంతాలలో స్థాపించాలి.

3)నదీజలాల, పంపిణీ సక్రమంగా జరగాలి.

4)వివిధ ప్రాంతాలకు రైల్,రోడ్ వ్యవస్తలుమెరుగు పరచాలి. కేంద్ర ప్రభుత్వమే ఖర్చుభరించాలి.

5)విద్యుథ్ ప్రోజెక్టులు ,సంప్రదాయేతర విధానాలతో  ముఖ్యంగా సూర్య శక్తి, సముద్ర అలల తో విద్యుత్ వుత్పాదనను అభివ్రుద్ధి పరచి బొగ్గుకై తెలంగాణా పై ఆధార పడకుండా చూసుకోవాలి..

 6) యిప్పటి వరకు హైద్రాబాద్, యితర తెలంగాణా ప్రాంతాల్లో వున్న, ప్రభుత్వ ,పారిశ్రామిక ప్రైవేటు వుద్యోగాల్లో వున్న వారిని ,పరిశ్రమలలో వున్న వారినీ, వుపాధ్యాయులను ,పోలీసు న్యాయ వ్యవస్తల్లొ, రెవెన్యూ వ్యవస్త లాంటి యితర ప్రభుత్వోద్యోగాల్లో వున్న వారిని,తెలంగాణ ప్రాంతంలోనే ఆయా వుద్యోగాలలోవుండనివ్వాలి. తెలంగాణలోని అంధ్ర ప్రాంతం వారి ఆస్తులకు రక్షణ కల్పించేలా ఒప్పందం కుదుర్చుకోవాలి.

 7)రాజధానుల నిర్మాణం, ఎయిర్ పోర్ట్ ,రవాణా, రోడ్ ,విద్యుథ్ వ్యవస్తలకై అయ్యే ఖర్చు కేంద్రప్రభుత్వమే భరించేలా ఒప్పందం కుదుర్చుకోవాలి.

కడుపులో కుళ్ళుతో, ఒకరిపై మరొకరు, ఎదుటి వారివల్ల ,తమకేదో అన్యాయం జరిగిందని భావిస్తూ,కలిసి వుండేకంటే సుహ్రుద్భావంతో విడిపోయి ప్రేమానురాగాలు పెంచుకొంటూ కలకాలం ఒకరికి మరొకరు స్నేహ హస్తం అందించుకోవడం మంచిది.

త్రిలింగ దేశంగా ప్రసిద్ధి చెందిన తెలుగుల దేశం త్రైరాష్ట్రంగా ప్రసిద్ధి చెందుతుంది.

అర్ధరాత్రి స్వాతంత్ర్యం.

 రచన : నూతక్కి,

తేదే:11-12-2009

మనది ప్రజాస్వామ్య వ్యవస్త. రాష్ట్రాలూ,జిల్లాలూ, మండలాలూ,గ్రామ పంచాయితీలూ,అన్నింటికీ వికేంద్రీక్రుత రీతిలో పాలనా వ్యవస్తలు, ప్రజాస్వామ్య యుతంగా యేర్పడి వున్నాయి. ఒక రాష్ట్రం లో యే ఒక్క ప్రాంతంలోనైనా యే కారణంగా అసంత్రుప్తి నెలకొని విడి పోవాలన్న భావం వ్యక్తమైనప్పుడు, భావోద్వేగ పరిస్తితులను సరిచేసి ,ఆ ప్రాంతంలో ప్రజస్వామ్య యుతంగా ఆ ఒక్క సమస్య పై ప్రజల మనో భావాలు తెలుసుకొనేందుకు ప్రత్యేక యెన్నిక నిర్వహించి ,ఆ ప్రజాభిష్టానుసారంగా ప్రజాస్వామ్య యుతంగా వ్యవహరించడం సముచితం.అంతెగాని, నియంత్రుత్వ విధానాలతో….రాజకీయ ప్రయోజనాలను తూచి చూసుకొని .అర్ధరాత్రి కి అర్ధరాత్రి, ఒక రాష్ట్రాన్ని విభజించి ఒక భాగానికి స్వాతంత్ర్యం యివ్వాలని నిర్ణయం చేయడం అసంజసం. అది చాల తేలికే, నాలుక తిప్పడమేగా.

కానీ అమలు పరచడానికి, అనేక ప్రాతిపదికలు,ద్రుష్టిలో పెట్టుకోవలసిన అవసరం ఎంతవుందో అర్ధం చేసుకోలేని దేశ ప్రభుత్వ వ్యవస్త వుండటం భారత ప్రజల దౌర్భాగ్యం. యిప్పుడు జరిగే పరిణామాలకు కేంద్ర ప్రభుత్వం లోని కొందరు వ్యక్తుల అత్యుత్సాహం, వాచాలతలే కొంత కారణమైతే , టివి మీడియా వాచాలతవల్ల, అత్యుత్సాహం వల్ల అగ్నికి ఆజ్యం అంది వుద్రిక్తలు పెరిగాయన్న విషయం అర్ధం చేసుకొని వ్యవహరించ వలసిన అవసరం వుంది. కేంద్ర ప్రభుత్వం,రాష్ట్రాలను విడదీయాలనుకున్నప్పుడు,విడదీయబడుతున్న రాష్ట్ర భాగానికి రాజధాని నగరాన్ని ఎక్కడ యెంత సమయంలోనిర్మించి యిస్తారో తెలుపుతూ ఒక వంద సంవత్సరాల భవిష్యత్ కాల ప్రమాణాన్ని ద్రుష్టిలో పెట్టుకొని, కనీసం వంద చదరపు మైళ్ళ ప్రదేశాన్ని గుర్తించి ,ఆ ప్రదేశంలో నవీన రాజధానీ నగరాన్ని నిర్మించి యిచ్చే ప్రతిపాదనలతో, కావలిసిన ఆర్ధిక వనరులూ యేర్పరచి ,అవసరమైన ప్రభుత్వ భవనాలను నిర్మించి గ్రుహ సముదాయాలూ,వ్యాపార ప్రాంగణాలూ, పారిశ్రామిక వాడలూ, ఎయిర్ పోర్టులూ, వుద్యోగ వనరులూ, వుండేలా వ్యూహం రచించి అమలు పరిచి , మరో వంద సంవత్సరాల వరకు విస్తరణకు అవకాశం వుండేలా రోడ్లూ, మంచినీటి వ్యవస్తా, మురుగు పారుదలా,వర్షపు నీటి పారుదలా,వర్షపు నీటి సద్వినియోగానికీ, నిలువ చేసుకొనేందుకూ అధునాతన వ్యూహాలూ, విద్యుదవసరాలకొరకు, భవిష్యత్ అవసరాలు ద్రుష్టిలో వుంచుకొని,సాంప్రదాయేతర విద్యుదుత్పత్తి ప్రక్రియలూ,అండర్ గ్రౌండు కేబుల్ వ్యవస్త, మంచి నీటి సరఫరా వ్యవస్తా ,యితర ఆధునిక సాంకేతిక అభివ్రుద్ధి కి అవకాశాలూ, వనరులూ ,వున్న రాజధానీ నగరాన్ని,ఎక్కడ ఎప్పుడు ఎంత సమయంలో,పూర్తి అవుతాయో, దానికి కావలిసిన నిధులూ, వాటి లభ్యత వంటి విషయాలు,ప్రాతిపదికలు, వెల్లడించిన తరువాత మాత్రమే,రాష్ట్ర విభజన గురించి కేంద్ర ప్రభుత్వం ,వెల్లడించాలి.

 అంతే గాని ,తాత్కాలిక విపరిణామాలనుండి బయట పడేందుకు అర్ధరాత్రికి అర్ధ రాత్రి అసంబద్ధంగా రాజకీయ ప్రయోజనాల కొరకు,ప్రజల మనో భావాలను అర్ధం చేసుకొనే యెట్టి ప్రయత్నం చేయకుండానే, ఒక ప్రాంత ప్రజలను సంతుష్టులను చేసే యత్నంలొ రాష్ట్రాన్ని విడదీయ బూనుకొని ఆదరా బాదరా క్రొత్త రాష్త్ర ప్రక్రియలు చేపట్టడం తాము తీసిన గోతిలో తమను తామే పూడ్చి పెట్టుకొనే రీతియని గుర్తించ లేని , ప్రజలలో వుద్రిక్తతలు పెంచి, అందులో స్వలాభాలు ఆశించే రాజకీయ పక్షాలూ,అసమర్ధ ప్రభుత్వాలు వుండటం భారత దేశ ప్రజల దౌర్భాగ్యం.

అగ్నికి ఆజ్యం పోస్తున్న, టివి మీడియా.

( ప్రజలూ తస్మాత్ జాగ్రత.)

రచన :నూతక్కి

తేదీ:11-12-2009

 రాష్ట్రం లో ఓ నెల రోజులుగా జరుగుతున్న రాజకీయ ఘటనల నేపధ్యంలో టి.వి మీడియా వ్యవహరిస్తున్నతీరు ప్రజల మనో భావాలను రెచ్చకొట్టె విధంగా వుండి , ప్రజలలో వుద్రిక్తత పెంచుతూ,యాంకర్లు తమ వాక్చాతుర్యాన్ని,సామార్ద్యాన్ని వ్యక్త పరచుకొనే దిశలో, రాజకీయ వ్యక్తులను , సామాన్య ప్రజలను,తరచి తరచి అసంబద్ధ రీతుల్లో ప్రశ్నిస్తూ,రెచ్చగొట్టి సమాధానాలు రాబడుతూ,ప్రజలలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నాయి. యీ వుద్రిక్త పరిస్థితులలో వుద్రిక్తతలు పెరగకుండా సంయమనం పాటించి వుద్రేకాల పై నీళ్ళు చల్లవలసింది పోయి అత్యుత్సాహంతో సంయమనం కోల్పోవడం టి.వి మీడియాకు తగదు. విదేశీ టి.వి లను చూసి,మన టి.వి మీడియా,మక్కికి మక్కి తామూ అలానే చేయాలనే అత్యుత్సాహం వల్ల,సమాజంలొ జరగబోయే విపత్కర పరిణామాలను,సామాజిక శ్రేయస్సునూ, ద్రుష్టిలో పెట్టుకోకుండా వారి ప్రోగ్రాములను నిర్వహించడంలోసంయమనం పాటించవలసిన అవసరం సామాజిక భాధ్యత వారికే ఎక్కువ వుందని వారు గుర్తెరిగి వ్యవహారశైలి మార్చుకోవడం ఎంతో అవసరం అర్ధరాత్రి కి అర్ధరాత్రికి ఒక రాష్ట్రాన్ని విభజించాలంని నిర్ణయం చేయడం చాల తేలికే ,నాలుక తిప్పడమేగా. కానీ అమలు పరచడానికి, అనేక ప్రాతిపదికలు,ద్రుష్టిలో పెట్టుకోవలసిన అవసరం ఎంతవుందో. యిప్పుడు జరిగే పరిణామాలకు కేంద్ర ప్రభుత్వం లోని కొందరు వ్యక్తుల అత్యుత్సాహం, వాచాలతలే కొంత కారణమైతే , టివి మీడియా వాచాలతవల్ల, అత్యుత్సాహం వల్ల అగ్నికి ఆజ్యం అంది వుద్రిక్తలు పెరిగాయన్న విషయం అర్ధం చేసుకొని వ్యవహరించ వలసిన అవసరం వుంది.

« గత పేజీతర్వాత పేజీ »