కబుర్లలోపడి…ఓరోజు

(పిచ్చాపాటి కబుర్లు ….1)

 రచన: నూతక్కి

 తేది:25-02-2010

 ఈ మధ్య నా కంప్యూటర్ కు చాల సుస్తీ చేసింది. హాస్పిటల్ లో అడ్మిట్ చేయక తప్పలా. సడెన్ గ ఒక రాత్రి కంప్యూటర్ మీద తెలుగు కంపైలర్ చలవతో చల్లగా ఓ తెలుగు కవిత రాసుకొంటుంటె, దొంతర్లు దొంతరులుగా ఒక దాని మీద ఒకటి పేజీలు.గుంయ్ గుంయ్ మంటా ఒకటే అరుపులూ … యేమి చెయ్యాలో నాకు పాలు పోలా. వెంటనే ఆడియో ఆపు చేసా.అప్పటికే మా ఆవిడ లేచొచ్చి,యేంటండి రెండయినా యింకా పడుకోకుండా అని చిరాకు చూపేసి వెళ్ళిపోయింది. యింతలోనే, పక్క పోర్షన్లో అద్దెకుండెవాళ్ళు …వాళ్ళు లేచి యేమయ్యిందంకుల్ ? ఎంక్వైరీ….. ఏమీ లేదు మీరు పడుకోండని…అసలే యేం చేయాలో నాకేమీ పాలుపోక నేనేడుస్తోంటే వీళ్ళొకళ్ళూ, టకటక మీటలన్ని నొక్కేసి కరెంటు,ఇంటర్నెట్టూ కూడ పీకేసి గమ్మున కాసేపు కూర్చొని,చేసేదెమీలేక పోయిపండుకొన్నా.నిద్రపట్టదాయె. కష్టపడి టైప్ చేసిందంతా పోయిందని బెంగ.అదీ తెలుగులోనాయె. ఒక సారొచ్చిన అయిడియామళ్ళ మళ్ళ రమ్మంటె రాదుకదండి.అందుకే బెంగ. మళ్ళా లేచొచ్చి అన్నీ కనెక్ట్ చేసి చూస్తే అసలు లోనికే పోనీయలా.ఏదో అయ్యింది దానికి. .ఎదేదో సంకేతాలు.తెలుగే సరిగ రాయలేనోడికి ఇంగ్లీసేడొస్తది చెప్పండి.ఆ రాత్రంత దిగులుగానె పండుకొన్న. నిదర పడితేనా? తెగ కష్టపడి రాసిందంత పోయిందికదా. ఈమధ్య నా బోటోళ్ళు తెలిసీ తెలియకుండ కంప్యూటర్ లు వాడుతున్న వాళ్ళుచాల పెరిగిపోయారుకద, అదేలెండి అమెరికాలొ పిల్లలున్నాళ్ళు ఎక్కువయ్యారు కద. ఈమెయిల్ చేసుకోవడం,చదవడమ్ వరకు వాళ్ళకు బాగానే వస్తం ది గాని, యింకేదొ చెయ్యాలన్నప్పుదే అసలు సమస్యంతా.( అట్లాంటిదే నేనూ యేదో చేసుంటాలెండి. ) వాళ్ళకి అన్నీ అనుమానాలే ప్రతీ దానికీ డాక్టర్ దగ్గరికి పోక తప్పదు.(అదేలెండి కంప్యూటర్ క్లినిక్ కు).పిల్లలికి ఫోన్ చేసి అడిగితే త్యుటోరియల్ తీసుకోమంటారు. యీ వయసుకి యింక ఆసోకు కూడా. కొత్తగా పిల్లని కన్న అమ్మకి పెంచేతప్పుడు ప్రతిరోజూ ఒచ్చినన్ని అనుమానాలొస్తయ్ వాళ్ళకి . యేది నొక్కితే యేమౌతుందో నని భయం. అట్లని నొక్కకుండా వుండలేరు. వాళ్ళకోసం కంప్యూటర్ చికిత్సాలయాలు కూడ మెండుగ వెలిసినయ్. సమస్యతో వచ్చిన వాడికి యేమి తెలియదని వాడికి తెలుసు.సమస్య యేమీ లేకున్నా బాగానే గుంజడం నేర్చుకున్నారు.యేదైతే అది అయ్యిందని మా దగ్గర్లోనె మావాడి క్లినిక్ వుంది. అక్కడికి పొద్దున్నే పోతినిగద,నా ఆత్రం నాదాయె. అక్కడ కాంప్లెక్స్ వాచ్మెన్ షాప్ పదింటికి తీస్తారని చెప్పాడు. …..యీ సొదంతా చెప్పి మిమ్మల్ని విసిగించడం యెందుకులెండి…….. అట్లా.వాడు బాదిన వీర బాదుడు తో .నా బాధలేవో నేను పడ్డాగా… ఎట్లాగైతేనేం, డీ ఫార్మేటింగ్,రీ ఫార్మేటింగ్,విండోసనీ వాడి బొచ్చెనీ, బోలనీ,ఓ నాలుగువేలు ఒదిలించుకొని ,హాస్పిటల్ నుంచి మా కంప్యూటర్ ను మొన్నీమధ్యే యింటికి తెచ్చాం. . మనిషికి లాగే వీటికీ .వింత వింత వైరసులూ,రోగాలున్నూ. అదనీ యిదనీ ఓ నాలుగు వేలు తుప్పొదిలిందనుకోండి.ఇప్పుడు కొంచెం బెటరనుకోండి.

ఎందుకనో గానండి నా బ్లాగు రోజు చూసి కామేంటేసేవోళ్ళు సడ్డెన్ గా చూడ్డం,కామెంటేయడం మానేసారండి.నా బ్లాగొకటుందని ప్రెపంచానికి చెప్పింది వాళ్ళ కామెంట్లేనండి. యిప్పుడిట్లా చెయ్యడం అన్నాయం కాదేంటండి? జబ్బు పడ్డ కంప్యూటర్లకు మైల్ పంపితే తమ కంప్యూటర్లు గూడ జబ్బుపడతాయేమోనని వాళ్ళకు.భయమేమోనండి. మన కంప్యూటర్ జబ్బు పడితే వాళ్ళకు తెలుస్తుందాండి? యేమో ఆ మాత్రం మనమైనా అర్ధం చేసుకోవాలి గదండి మరి.

బ్రౌజింగ్ సెంటర్లు అందుబాటులో వున్నా చేతిలో సిస్టం వున్నంత వీజీ యేం కాదండి అయిడియా.రాగానె ఎక్కించెయ్యడానికి. కాగితం పైన కలం పెట్టి ఎన్ని రోజులయ్యిందండి? తప్పులు కొట్టివేతలు, పేపర్లు వుండలు చుట్టి చెత్త బుట్ట నింపడాలు,పెన్నులు రాసీ రాయక …. ఎవడు కనిపెట్టాడొ గానిండి,యీ ట్రాన్స్లిటరేషన్ సదుపాయం వుంది చూశారూ అధ్భుతం అనుకోండి.అంతా కంప్యూటర్ మీదే కదండి రాయడం అదీ తెలుగులో కాగితాలూ పెన్నులూ ఎందుకండీ. . అసలు యీ బ్లాగ్ అన్న ప్రక్రియ వుంది చూశారూ అందులో అ ఆలు నేర్సుకున్న కాడికెల్లి ఎవడికాడు మహా కవినో, రచయితనో అనుకొనే సదుపాయం యిక్కడ వుందండి. తెలియకుండానే కొమ్ములొస్తుంటాయండి……అందులో కామెంట్లెక్కువొస్తె కొండెక్కిస్తాయండి….

అయ్యెయ్యో !!….మాటల్లో పడి పోయానండి…. ఏదొ వాసనొస్తాందండి . గ్యాసు వాసనలా వుంది. మరిచే పొయా…. స్నానానికెళతా పొయ్యిమీద పాలు చూడమందండి మాఆవిడ .అంతా అయిపోయింది. పాలు పొంగి స్టౌవ్ ఆరిపోయి గ్యాసు వాసన ఒస్తాంది.పాలు సింకు లోకి ఆనందంగా పరుగిడుతున్నాయ్.కిచెన్ ప్లాట్ఫారం మీద ,గ్రానైట్ పరిచినవాడిని మెచ్చుకోకుండా వుండలేకపోయాను. తిన్నగా సింకులోకే స్లోప్ పెట్టినందుకు. రెండు లీటర్ల పాలు మొత్తం సింకు పాలు.. యింకా కాఫీ కూడ తాగలేదండి. హొల్ మిల్క్…..యేమ్ చెస్తాం కిలో మీటర్ దూరమెళ్ళి తెచ్చిన పాలు..? మళ్ళీ అంత దూరం వెళ్ళి రావాలి. కాఫీకైనా తప్పదుకదా. . గిన్నె మాడిపోయివుంది……….గ్యాసు ఆపి అట్లాగే నిలబడ్డా. నా కంప్యూటర్ కొచ్చిన జబ్బుగురించి మీకు చెబుతూ యిప్పుడు నాకీ దుస్థితి. ……. మా ఆవిడ వస్తే ఆవిడ ముందు నా గతేంటి? చేసేదేముంది? నా తిట్లు నే తింటా, నా తిప్పలు నే పడతా.