సమాజ హితం కోరి ...
రచన: గిజిగాడు.
తప్పుకు ఒప్పుకు మధ్య తరతరాల సమాజాల అనుభవాల ప్రతీకగా గీయ బడిన గీతలు నాటుగా కనబడినా  సమాజానికి నేటికీ అవి గీటు రాళ్ళే .అర్ధం చేసుకొని ఆచరించడానికి అహంకారం అడ్డొస్తోంది.
పట్టపగలు నడిరోడ్డున నాగరికసభ్య సమాజపు  నగరంలో జనావాసాలమధ్య జరిగిన,దాడులూ  హత్యలు దురంతాలు ఏవైనా మానవ సమాజం ఖండించి తీరాలిసిందే.
మనిషికి జంతువులనుండి, ప్రక్రుతి భీభాత్సాల నుండి  సంరక్షించుకొనే దిశగా మానవ సమాజాలు ఏర్పడ్డాయి. కాని తానె నిర్మించుకున్న   రక్షక భట పటిష్టతల మధ్య మనిషికి మనిషి నుండి రక్షణ కరువైన ఉదంతాలు మనం తరచూ చూస్తున్నాం.
నేరచరిత్రలో పుట్టి,  నేరచరిత్రలో పెరిగి, నేరచరిత్రలో  చచ్చినవారి చరిత్రలు, సమాజాన నెత్తుటి చారిక గా మారి  రక్త చరిత్రలుగా నిలచిపోతున్నాయి.వీటికి  మీడియా ప్రాచుర్యం ,ప్రాముఖ్యం యివ్వడం వల్ల,నేరస్తులు హీరోలవుతున్నారు.
వాస్తవానికి చరిత్ర  పుటల్లో కధా నాయకుల కధతో పాటు విలన్లనూ ప్రస్తావిస్తారు. కానీ ప్రస్తుత కాలంలో  మీడియా చలవతో   విలనీనే హీరోయిజమౌతోంది.
సందర్భోచితంగా  మీడియా సంయమనం పాటించి ఎంత క్లుప్తంగా చర్చించితే సమాజానికి అంత హితం చేసినవారౌతారు..
సమాజానికి వెన్నుకాచిన హీరోలు జీరోలుగా  మారి,వారికి  నీరవ నిశ్శబ్ద చరిత్రలూ కరువౌతున్నాయి.భావి తరాలకే కాదు నేటి బాల్యానికీ తప్పుడు సంకేతాలు అందుతున్నాయి.
భావి తరాలకు  తప్పొప్పుల తీరులపై తప్పుడు సంకేతాలందిస్తున్నామన్న భావన, అన్ని మీడియాలూ అర్ధం చేసుకుంటే  సిగ్గిలవలసిన స్థితి.
సమాజనికి  హితము  ,అహితము మధ్య  అక్షర మాత్రపు వ్యత్యాసంగా మాత్రమే భావిస్తున్న మీడియా  …. పరిస్థితుల సున్నితత్వాన్ని గ్రహించలేని  వారి అవగాహనా రాహితి క్షమించ రానిది.
రోజులకు రోజులు ఒకే  విషయమై అదేదో  ప్రపంచానికే చావు బ్రతుకుల సమస్యలా   ఊదర కొడుతూ…  వుంటే  నేరస్తులు హీరోలవుతున్నారు. యిది ప్రజా స్వామ్య  దేశానికి పట్టిన దుర్గతిగా భావించాలి.
అన్ని మీడియాలూ  భావ ప్రకోపాలు రెచ్చ గొట్టక వాస్తవాలు మాత్రమే వ్యక్తీకరించే రీతిలో ప్రక్షాళన దిశగా  ప్రయత్నాలు కొనసాగాలి. జరిగిన తప్పులు దిద్దుకొని  మీడియా ప్రముఖులు కర్తవ్య నిష్ఠ పై దృష్టి సారించాలి. అది సమాజానికి హితమౌతుంది.
ప్రకటనలు