పందికొక్కులూ
జాతి మిము క్షమాపణ కోరుతోంది .
రచన : నూతక్కి రాఘవేంద్ర రావు.
తేది :24-01-2011
యీ స్వాతంత్ర్య భారత గణతంత్ర వేళ
పందికొక్కులూ!
జాతి మిము క్షమాపణ కోరుతోంది
మము క్షమించండి
మిక్కిలిగా మితిమీరి తినేవారిని
మీతో పోల్చుతుంటాం
పందికొక్కుల్లా మెక్కుతున్నారని
సుజలాం సుఫలాం
మలయజ శీతలాం
అని మమ్ము  మేము
పొగుడుకొనే  రోజులు
పోయాయిక
కోట్లాది బడుగు జనుల
జీవితాలు ఫణం పెట్టి
వేల కోట్ల రూకలతో
బొక్కసాలు నింపుకున్న
కామందులు మాముందు ఉండగా
ఏమీ చేయలేని ఆసక్తతలో మేమున్నాం
ఇంకా నిను నిందించడమా
తప్పు తప్పు తప్పు మా చెంపలు
మేమే కొట్టుకొంటాం
నిను తిట్టినందుకు
దోపిడిదారులను
నీతో పోల్చినందుకు.
అయినా నీవు మేక్కిన్దెంతలే
సంవత్సరానికి సరిపడా
ఓ రెండు బస్తాల ధాన్యం
నీ ఆకలి తీర్చుకొనేందుకు
మాత్రమేగా!
నీవేమి పోటీ పడగలవూ
వంద తరాలకూ
అనుభవించినా తరుగనంత
ప్రజాధనం దోచి దాచిన
ధూర్త మేధావులతో
రోడ్లూ ప్రోజేక్ట్లూ ,
కాలవలో పూడికలూ
నిత్యావసర సరుకులూ
అడియిది అని ఏమీ లేదు.
ఆఖరుకు
మురుగు కాల్వలూ
సమాధు లున్నూ
పిల్లలమందులు,
మధ్యాహ్న ఆహారాలు
ఒకటేమిటి అన్నీ
లక్షలాది కోట్ల రూకలు
ప్రజాధనం తమదిగా
కూడబెట్టిన కామందులు
మా రాజకీయుల  ,
అధికార గణాల
నల్లదన సంపదల
గణాంకాలు
అంచనాలు వేయలేక
గణితమే మూగబోతున్న వేళ
త్యాగధనుల స్వాతంత్ర్య ఫలం
గుప్పెడు దోపిడిదారుల గుప్పిట
యీ స్వాతంత్ర్య భారత గణతంత్ర వేళ
పందికొక్కులూ
జాతి మిము క్షమాపణ కోరుతోంది
మము క్షమించండి.

మము క్షమించండి.