నేస్తం!
(నీ పేరన్నా చెప్పి చావవా !)

రచన :నూతక్కి రాఘవేంద్ర రావు
31-01-2011

నేస్తం ఇది న్యాయమా !
హటాత్తుగా
యీ క్షణం నా ముందు
నిలిచి ..
“నీ బాల్య మిత్రుని నను
పోల్చుకోమ్మ్మని
పేరు చెప్పుకొమ్మని”
నీ వనడం ?

ఎన్ని నాళ్ళు
ఎన్ని యేళ్ళు
ఎన్నెన్నని దశాబ్దాలు …
గడచిన కాలపు గ్నాపకాల
దొంతరలు తిరగేసుకుంటూ….
బాల్యపు స్మృతుల పుటల్లో
నడయాడుతు నా వెదుకులాట ….

వుడుత కొట్టిన
జామ కాయ
కాకెంగిలి చేసుకు
నాతో పంచుకుతిన్న
కామేశానివా ?

ఉప్పు కారాల పొట్లం లో
చెట్టు కొమ్మపై కూర్చొని
పూల్లమామిడి కాయలు
నాతో కలిసి నంజుకుతిన్న
కిష్టిగాడివా!

కోతికొమ్మచ్చిలో
తొండి చేసి పారిపోయి
తొందరలో భయంతో
నిమ్మ చెట్టు పొదల ముళ్ళల్లో
ఇరుక్కున్న
వుమ్మిగాడివా!

మోట బాయి బానలో
నా వెంట దిగి
నీళ్ళల్లో మునిగి
బెంబేలెత్తి
గావుకేకలేట్టిన
కోటి గాడివా.!.

పెద కాలవ గట్టు మీద
నేరేడు కొమ్మేక్కిన
నను కాలవలో తోసి
పారిపోయిన పుల్లిగానివా!
.
ఎవడివిరా
నువ్వెవరయి ఉంటావు?

గడచిన గత కాలపు
జ్ఞా పకాల
దొంతరలోఅందరినీ
తిరగేస్తూ
నీ కోసం వెదుకుతున్నా….
బాల్యపు స్మృతుల పుటల్లో
కనిపించే రూపులలో
నిను ,నీ ఆహార్యం,వాచికం
సరిపోల్చుతూ
స్పష్టాస్పష్టంగా
నా అంతరంగాన
నీ అప్పటి రూపును
శిల్పిస్తున్నా
మధించి చూస్తున్నానాగు
ఆగలేకుంటే ..సరి
వెధవా నీ పేరన్నా చెప్పి చావు. …. ..