ప్రకృతే విలయిస్తే !!!

రచన: నూతక్కి
తేది:11-03-2011

జపానులో నేడైనా …

జల ప్రళయం భూ కంపం
అగ్నిపర్వత విస్పోటనలు
గ్రహ శకలాల తాకిళ్ళతో
మహోధృత విధ్వసనలు
జనజీవ  హననం   

జీవులు విలపించే
అవకాశాలూ ఉండవు
హే భగవాన్ రక్షించని
వేడుకొనే క్షణాలూ దక్కవు
అహంకారాలు
హూంకారాలు
క్రూర ఘోర ప్రవృత్తుల
కుస్చ్చితాల వికృతాలు
భగవంతునిపేర మానవ
జాతి విభాజనలు
విధ్వంసనలు ..
జలప్రళయ వికృతం
విసుగు చెంది ప్రకృతి
చేసిన కరాళ నృత్యం….
కాని …
నిత్య జీవన విన్యాసాలకు
యే విధ్వంసం లేకుండా…
నేను ,నాది, నా మతం ,
నా ప్రాంతం,  నా దేశం ,
మనిషి మనిషిని హింసించే
సంస్కృతీ ప్రతీకలను
విధ్వంసించే
నైచ్య  భావ  వికృతాల
అహంకారాలు తుడిచి పెట్టె
సుహృద్భావ సునామీలూ
కావాలిక్కడ  కావాలిప్పుడు