వికృత కేళి
రచన : నూతక్కి.

కవల సౌధాలు

కూలినపుడు
కూల్చబడినప్పుడు
మానవుడే
మానవునిపై
జరిపిన దారుణ
వికృత చర్యగా
విస్తుపోయాం
ప్రపంచ ఆర్ధిక సామ్రాజ్యపు
సకల వ్యవస్తలు నేలకూలి
నిర్వీర్యమై
ప్రపంచ ఆర్ధిక చిత్రం
వర్ణ రహితమై అస్తవ్యస్తమై ….
క్రమేణా క్రమ రీతిన
జవసత్వాలు
సమ కూరుతున్న
యీ తరుణాన ….
ప్రపంచ ఆర్ధిక వ్యవస్తకు
శాస్త్ర వినియోగానికి ఉత్పాదనకు
తానో ప్రముఖ తార్కాణం…
బలీయమైన
ప్రపంచ  ఆర్ధిక ఉత్పాదక
కార్మిక వ్యవస్థ జపాన్
నేడు
విలవిల లాడుతోంది
ప్రకృతి జలఖడ్గ  తాడనాన
భూ కంప తీవ్రతన
అగ్ని పర్వతాల విస్ఫోటనల
అణుధార్మికతా జలకాల
లావా ప్రవాహాల ప్రకోపనల
భయ భీకర భూకంపనాల
నగరాలకు నగరాలు
ఆకాశ హర్మ్యాలు
సమోన్నత పారిశ్రామిక
భవన సముదాయాలు ,
వోడలు కారులు
ఒకదానిపై మరొకటి
పోటీపడి  అధిరోహిస్తూ
భవనాలపై  పయనిస్తూ
క్షణాలలో తుత్తునియలై
చెత్తగా  మారి  జలప్రళయ
విలయ ప్రవాహంలో
కొట్టుకు పోతుంటే
వేలు లక్షల జనులు
తమ ప్రాణాలు
తమ కళ్ళ ముందే
ఊపిరందక ఎగ  శ్వాసతో
పైకెగసి పోతుంటే
తనవారేక్కడో రక్షించుకొనే
తావెక్కడ ?తనను
రక్షించే వారింకెక్కడ  ?
దోషిగా
ఎవరిని నిందిద్దా మిక్కడ ?
శాస్త్ర జ్ఞాన పుణ్యమా
యని
యీ ప్రాకృతిక విక్రుతాలను
గతం లో ఎన్నెన్నో వీక్షించినా ….
మానవాళి పై  ప్రకృతి
విన్యసించిన యీ శతాబ్ద
వికృతం
ఓ జాతినే తుడిచి పెట్టాలని
ప్రకృతి విరచించిన వ్యూహమా !
తా తలచినచొ   ఏ జాతీ
తనపై  మనలేదని
సూచనగానా?
యీ విన్యాసం!  బీభత్సం !