ఖరానికి ….
రచన :నూతక్కి రాఘవేంద్ర రావు.
ఖరానికి
స్వాగాత మందిద్దామని
అనుకున్నా
వేప పూ   చేదుల సుగంధాలు
మామిడి  పిందెల వగరులు
జలదోద్భవ  లవణగుళికలు
ఎర్ర  మిరప   కారంతో
మదన బాణ రస ఝరితో
అడవిని  కాచిన చింత పులుపుతో
షడ్రుచులు మేళవించి
నే చేసిన
ఉగాది  పచ్చడితో ….
కుహుకుహుస్వరాల
కోయిలమ్మ గీతాలతో
ఏదీ! ఎక్కడా  కనబడదే!
మామిడి  పిందెల  జాడ ?
వేప పూ దేనియాల
సుగంధ సౌరభాలు
నీరూ, చెట్టు నీడా దొరకక
గొంతు పెగలక పాపం
వినబడదులె
కోయిల కుహు కుహు
రావ విభావరి
గతి తప్పిన కాల
ప్రభావాల
ప్రలోభంలో
ఆమని వచ్చిందన్న సంగతే మరచి
పూతపూయక ఆదమరచి న
వేప కన్నియ నేమనాలి
తెలుగుల మెదళ్ల
మొదళ్ళ లో ఇంకి పోయి
ఎండి పోయి నసితున్న
సహోదర భావన
పై రాష్ట్రాల స్వార్ధ సరళి తో
నిండుకున్న నదీమ తల్లుల
గర్భ కోశాలు
నీరందక ఎండిన చెరుకు పంట
జీవితాలకే తీపి లేదు
ఉగాది పచ్చడికి దక్కునా తీపి
ఆ తీపీ కార్పొరేటు సరుకై పొతే
ఆతీరుననే ఉప్పూ పులుపూ
అందుకే
అన్నీ కరువౌతున్న వేళ
ఉగాది పచ్చడీ
ఓ కార్పోరేట్ సరుకై
మాన్యులకు దక్క
సామాన్యునికి
అందదింక.
మాటల స్వాగతంతో
మాయ మాటలతో
కార్పొరేటు రీతిలో
ఉత్తుత్తి మాటల తో
స్వాగతిద్దాం
ఖరగానం
ఆస్వాదిద్దాం
వీలయితే మనందరమూ
స్వరం కలుపుతూ
ఖరాన్ని సాదరంగా ఆహ్వానిద్దాం