ప్రత్యేకించి ఎవరినీ ఉద్దేశించి కాదు కానీ అందరికీ.
రచన : నూతక్కి.

ఎవరినీ ఉద్దేశించి కాదు,కాని అనేకమంది యోచించ వలసిన విషయం.నిష్టూరంగా అనిపించినా…ఎఫ్ బి తెలుగు సాహితీ గ్రూపుల్లో , బ్లాగుల్లో భావ వ్యక్తీకరణల లోఉప్పొంగిన భావావేశం ఓ రకంగా అభినందించ తగ్గదే అయినా …పోను పోను కవితాత్మకతకు భంగం వాటిల్లినట్లు అనిపిస్తోంది కొన్ని కవితలలో .
అహో ఓహో అని కామెంట్లయితే పెట్టేస్తున్టాము. కొందరు నిష్ణాతులైన కవులు అని పిలవ దగ్గ వారు కూడా పది గ్రూపులకూ ఏదో వకటి పోస్టు చేయాలనే తపనలో భావుకతకు ,పదాల కూర్పుకు ,కవితా రూపానికి,వస్తువుకు ప్రాధాన్యమిస్తున్నట్లు కనబడటం లేదు. అక్షరాలు పదాలుగా కూర్చి అసంబద్ధ భావాలను ఇమిడ్చి రాసినంత మాత్రాన అది కవిత్వమై పోదు.ఏ ఒక్కరి గూర్చి చెప్పడం లేదు. భావ వ్యక్తీకరణా విధానాలలో లోపిస్తున్న నాణ్యతా ప్రమాణాల నేపధ్యమే నా ఆవేదనకు కారణం.ప్రింటు మీడియాకు , విజువల్ మీడియాకు ఎడిటింగ్ వుంటుంది.కొన్ని నిర్దిష్ట ప్రమాణాలు నిర్దేశించ బడి వుంటాయి. అక్కడ పరిమితులకు లోబడుతాము. ఇక్కడ పరిమితులు ,నియంత్రణలు వుండవు. అందు చేత అనంతమైన స్వేచ్చ. ఆ స్వేచ్చలో కొట్టుకు పోతోంది భావుకత, సాహిత్య ప్రమాణం.

అనేక మంది ఔత్సాహిక యువత…. మీలో అనేక మందికి ఏకలవ్య శిష్యులు .లబ్దప్రతిష్టులైన మీ నుండే నేర్చుకుంటారు. మీరు ఏది చేస్తే అది సబబుగా భావిస్తారు. మీ పొరబాట్లను ఒప్పులుగా భావిస్తూ తామూ ఆ రీతిన వ్రాస్తూ పోతూ భావితరానికి వక్ర భాష్యం చెబుతారు.తామూ కవులమని చంకలు గుద్డు కొంటూ వుంటారు. అందుకే మీరు వేసే ప్రతీ అడుగూ సవ్యమై భవ్యమై వుండాలి. అందుకే నా యీ వినతి. నేనేదో పుడుంగు గాడినని కాదు .తెలుగు భాషా ప్రేమికునిగా గత మూడున్నర ఏండ్లుగా తెలుగు మాధ్యమాన అంతర్జాలంలో వ్రాస్తున్న మీ కుటుంబ సభ్యునిగా చనువుతో వివరిస్తున్నా.

తెలుగు సాహిత్యంలో ఔత్సాహికులు ఏ ఏ రీతుల , ఏ ఏ ప్రక్రియలను ఎంచుకొని వ్రాసినా ఆయా రీతులలో నిష్ణాతులైనవారి మార్గ దర్శ కత్వం లో కొన్ని ప్రమాణాలు నిర్దేశించే మార్గ దర్శక వ్యవస్థ అంతర్జాల తెలుగు సాహితీ కూటములకు,బ్లాగులకూ కావాలి .
ఎక్కువ రాయాలనే తపనలో నాణ్యత కు అన్యాయం చేయవద్దని. తమను ఎందరో ఔత్సాహికులు ఆదర్శంగా తీసుకొంటున్నారు అన్న విషయాన్ని గుర్తు వుంచుకొని మెలగాలని, .వారికి మనం సవ్య మార్గం చూపించాలన్న భాద్యత గుర్తెరిగి వ్యవహరించాలని,.. యీ సాహితీ గ్రూపులవల్ల,బ్లాగులవల్ల ,అంది వచ్చిన సాంకేతిక పరిజ్ఞాన్ని వినియోగించుకొని ముందుకురుకుతున్న యువతలో ఉప్పొంగుతున్న….. ,తెలుగులో వ్రాయాలన్నతపననూ,జిజ్ఞాసనూ,సాహిత్యాభిలాషనూ, మనమందరం ప్రోత్స హిస్తించాలి ,స్వాగతించాలి ….కాని ప్రమాణాలకు తిలోదకాలివ్వని రీతిలో ….. .ఆ భావనతో ఔత్సాహిక యువత మునుముందుకు సాగాలనీ విజయం సాధించాలనీ అర్ధిస్తూ …. .అన్యధా భావించవలదనీ ఆకాంక్షిస్తూ ….శ్రేయోభిలాషి …నూతక్కి.