నేను .
రచన : నూతక్కి.

నేటి మానవుడు

నేను లేనిదే కాలు కదపడు . .

నా స్తాయితోనే పెరుగుతుంది
నను వినియోగించే మనిషి దర్పం
నేను తోడున్నప్పటి విలువ
యింటా బయటా అంతటా
నేను లేకుంటే లోకువ
నేను ఒకటి కాదు జంటను
ఒంటరిగా ఎందుకూ కోరగాను
కుడి ఎడమల వ్యత్యాసంతో .
నన్ను సృజించిన
వాణ్ణి
నీచంగా చూస్తుందీ  ప్రపంచం.
నన్ను సృజించినందు ననే
 అస్ప్రుస్యు డై ఆతడు .
డబ్బున్నవాడు నను యంత్రాలతో
సృజియిస్తే  వాడికి సిరి
ఎక్కడకేగినా పురస్కారమే
అప్పులతో ఆకలితో చస్తున్న వాడు
నను తయారు  చేస్తే వానికది వెలి
ఎటు వెళ్ళినా  తిరస్కారమే
నను వినియోగించే వాడు
సంఘంలో గౌరవ సభ్యుడు
నను తయారు చేసినవాడినీ
నను రెండు కాళ్ళతో త్రోక్కినట్లే
త్రొక్కుతూ  సమాజం
వాకిలి వెలుపల  ఎచటో నొ
దూరంగా పెడుతూ
చచ్చిన కళేబరాలను
దూరంగా తరలించి తాను
కుళ్ళు దుర్వాసనల
రోగాల పాలయి
చర్మాన్ని వలిచి
నను సృష్టిస్తూ
సమాజపు సంరక్షణలో
సంఘం తో  ముద్రవేయించుకుని
 అంటరాని వాడై
నాకున్నమాత్రపు
విలువ పొందని
నా సృష్టి కర్తను తలుచుకుంటూ
కిర్రుమంటూ జంట గా
రోదనలో వేదనలో  నేను