బ్లాక్ హోల్
రచన: నూతక్కి రాఘవేంద్రరావు.
తేది: 02-11-2015
………………………………………….
అనిచ్చితి అసహనం
నిస్సహాయత ,కోపం , దుఃఖం,
ఆవేశంఆవేదన, ఆందోళన
నిన్నుచుట్టూముట్టాయా !
నిన్ను నీవు వదిలించుకోవాలన్న
తపనా !
అట్లయితే యిట్లాచెయ్యి

అర్ధరాత్రి
కొండమీది
ఓపరుపుబండపై
వెల్లికిలా
పడుకొని
మేఘరహిత గగనం
వీక్షించు
నీఅంతరంగాన్ని
వాహనంగా మలుచుకో
నీమనస్సును ఇంధనగా .

అంతరిక్షయానం లో
పొరలుపొరలుగా
పొర్లుతున్న
క్వాజార్లూ
నక్షత్రాలూ
గెలాక్సీలూ
తారామండల
సముదాయాలు
చీల్చుకుంటూ పో
మృతిచెందుతున్న
నక్షత్రాల హాహాకారాలు
మరణించిన నక్షత్ర కళేబర
చిన్నారిశకలాల వేదనలూవెదుకులాటలు
అమ్మకోసంనాన్నకోసం
అవిచేసేఆక్రందనాభరిత
విసృంఖల విన్యాసాలు
విశ్వరాసిని కబలించాలని
ఆవురావురున
నోళ్ళుతెరిచి నిరీక్షించే
బ్లాక్ హోల్స్ ఆకళ్ళు
వాటిముందు
నిన్నునీవుపరుచుకో
ఒక్కసారినిన్నునీవు
పరికించుకో

నీవంటూఏమీవుండదు
నీవొక శూన్యం
నీకుతెలిసిన ఇసుకరేణువుతోనూ
పోల్చలేని స్థితి
దుర్భిణిలోనూ
కంటికికనబడని
సూక్ష్మాతి సూక్ష్మపరి మాణం లో
నీవు

నీ సంసారం,నీకష్టాలూ,
నీబాధలూ,నీ వేదనలూ
నేఒక్కనికే అనుకోకు
అందరికీ ఉన్నాయ్
నీచుట్టూప్రపంచంలో
నీకష్టం నథింగ్
మరి విశ్వంలో నువ్వూనీకష్టాలు ఎంతని ?

వెళ్ళినంత వేగంతోనూతిరిగివచ్చి
నిన్నునీవుఆవహించుకో
బ్రతికుంటే బలుసాకు
ఉన్నదానితో త్రుప్తిపడు. లేకుంటే
కష్టపడు
సాధించు.
నిరాశను నిస్ఫ్రుహలు
ఆకర్షిస్తాయి
ఆశ్రయించకు
అవి బ్లాక్హోల్స్.
కబళిస్తాయి.
…………………………………………..

ప్రకటనలు