శ్వేత కోకల్లో, ఎన్ని సీతలో

రచన :నూతక్కి రాఘవేంద్ర రావు.

ఉదయాన్నే
వరెండాలో కూర్చొని
వాటినే చూస్తున్నా
ఈరోజు

ఎన్ని వయ్యారాలో
ఎన్నెన్ని వగలో
ఎక్కడ చూసినా
శ్వేత కోకల్లో సీతలు

సూర్యకాంతిలో
మిలమిలమని
ఎగిరే సీతాకోక చిలుకలు
కెమెరాలో
బంధించడం
ఎంత కష్టం.

ఒక సీత చేష్టల్ని
గమమనిస్తూ వున్నా
క్షణ కాలం కాలునిలవదెందుకని ?
నా కండ్లెదుటకు వచ్చి
మరుక్షణం
మరెక్కడికో
అక్కడేదో వున్నట్లు
పదిళ్ళ ఆవలి చెట్ల పైకి
ఎండలో మిలమిల మెరుస్తూ
పరుగులలో రవళులు

ఒక్క క్షణం అక్కడ
తచ్చాడి
ఇక్కడ కొంపలు
మునిగిపోతునట్లు
ఆత్రంగా వెనుదిరిగి
మధ్య మధ్యలో
పూబాలలతో సరసాలు
మరుక్షణం
నా ముందున్న
చెట్టు పైకి చేరి
టీ సిప్ చేస్తున్నట్టు
పూవులో తేనే జుర్రుకుంటూ
ఓరగా నన్ను చూస్తుంది
అదో చాలెంజ్ !

తనతో పరిగెత్తమనో!
చేతనైతే
తనను క్లిక్ చేయమనో !
క్లిక్ చేసేలోపు
పకపకా నవ్వులు
తెల్లని రెక్కలల్లార్పులు

కెమెరాలో చిక్కిందో లేదోనని
తేరిపార నే చూస్తుంటే
ఏదీ నేను చూస్తానన్నట్లు
నా భుజం పై వాలుతుంది

నా కెమెరా
తనవైపు
తిప్పుతానా !
పైట విసిరి
చెంప నిమిరి
తుర్రుమంటుంది

శ్వేత కోకల్లో
ఎన్ని సీతలో!
పెరెడ్ లో
తెల్ల కోకలు
యూనిఫారం
అంతటా శ్వేతమే.

ప్రకటనలు