స్వాస్త్య కవచం
రచన: నూతక్కి రాఘవేంద్రరావు.
………………………………………
ఆ దృశ్యం
అత్యద్భుతం
మేఘాలమాటుకు
మటుమాయమవుతు
వన్నెలెన్నో
ఒలకబోస్తున్న
సూరీడు.
దురదృష్టం
వెంటాడుతూ
నన్ను…

కెమెరాలో
బ్యాటరీ అవుట్!

అక్కడ మరోరకం
తిప్పలు
ఆదృశ్యాన్ని
అక్షరీకరిద్దామని
జేబులుతడుముకున్నా
కాగితం ఉంది కాని
కలం మరిచొచ్చానని
అదో అసహన సత్యం.

మరోచోట కరుణారసదృశ్యం
రంగుల్లో
బంధించే వీలులేదు
రంగులు చెంతలేవు
అసలు కాన్వాసేలేదు
అనుక్షణం
అవి వెంటుండవుగా.

తీరా కెమెరా
సమకూర్చుకొని వచ్చానా
దృశ్యం కనుమరుగు.

కాగితాలు కలాలు,
రంగులు,కుంచెలు
సకూర్చుకు వచ్చేలోగా
జ్ఞాపకాల మెరుగులపై
పేరుకున్నకాల ఖండికల
మకిలలు మరుపులు
కాలగమన రీతుల్లో
వయసుతో క్రీడలు
ముదిమి అంటే
కాలానికీ
చులకనే.

గతాలు జ్ఞప్తికిరానీదు
మతిమరపు
అది
కాలగమనపు కాలుష్యపు పొర
అయినా మనిషికి
అదే స్వాస్త్య కవచం.

………………………………………