saamaajikam


పురుషాధిపత్యం

(యింకానూ యికపైనా సాగును)

రచన : నూతక్కి

తేదీ:24-02-2010

పురుషాధిపత్య

అహంకార ధోరణుల

పీడనలో……

అధునికులమనుకున్నా

యీనాటికీ

పడతో,వనితో,

యింతో, నారో..స్త్రీ యో ….

యీడే జన్మించిన యామె

 జన్మస్థలికే జన్మతహా

ఆ…డది

ఆత్మీయులకు,

ఆత్మీయతకు

అందనంత దూరం …

పెళ్ళనే పేరుతో

పెడగా పంపబడుతు

అనుబంధం అత్మీయత

అణుమాత్రం తరగనిఆమె….

పెడధోరణి మానని

సమాజపు తీరులు….

జననంలోవాడైతే

జన్మస్తలిపై జన్మతహా హక్కు

కూడైనా పెట్టని

వాడితో కునారిల్లుతూ…వీడు.

పున్నామ నరకమనే

 నమ్మకాల సుడిలో…..

 అమ్మో, అక్కో,

భార్యో,చెల్లో,బిడ్డో

,మనుమరాలొ అత్తో,

అమ్మమ్మో, నాన్నమ్మో,

వదినో, మరదలో

 వరసలు యేమైతేనేం

ఆడది ఆ…..డ దంటు

ఆస్తులు అందని

దూరాలకు తరిమేస్తూ

 అడ కు ఆడే

శత్రువఔతు

చట్టం….నైతిక సామాజిక వైవిధ్యం

 రచన: నూతక్కి

 తేదీ:20-02-2010

సామాజిక ఆర్ధిక నేపధ్యంలో

 సోరోగసీ చట్టబద్ధనీడల్లో…..

నారి తనగర్భం

నవమాసాలు

అద్దెకిస్తే సమ్మతం

చట్టానికి!!!

ఆర్ధిక రణ రంగపు

 నేపధ్యపు కల్మష

కూపంలొ సామాజిక

ఆర్ధిక నిక్రుష్టతలో

 కడుపుకు ఓ మెతుకుకై

మానిని తన మానం

అద్దెకిస్తె దుష్క్రుత్యం

అది చట్టానికి

యేజెన్సీల పేరుతో

పేపర్లపై సంతకాల

అంగీకారాలుతో

సగౌరవ వైద్య

 మర్యాదలతో …అక్కడ

భయంకరంగా

బలవంతంగా

 తరలింపబడి

 బ్రోకర్ల,డాఫర్ల

కనుసన్నల్లో

 నకనకలాడే కడుపుల్లో

 తన్నులతో…యిక్కడ

 ఆర్ధిక స్వావలంబనలొ

 సమాజానఒకరు

 ఏహ్య ధ్రుఃక్కులతో

యీసడింపులతో

 మరొకరు.

జలగల్లా

సమాజరుధిర పిపాసులు

అక్కడ అధికార నిర్వహణలో

 యిక్కడ అధికారుల నిర్వహణలో

 విధిగా పహారాలో

 ప్రజా ప్రభుత్వాలు.

 

ఆదెపత్తెప్పోరుల అయిదో “మా” కారుడు.

రచన: నూతక్కి,

తేదీ : 27-01-2010

అప్పటి దినాల్ల,

ఆ మద్రాసుకెల్లి

యిడివడొచ్చిన

ఆంధ్ర పెజల నెత్తిన

మాకొద్దు మొర్రో అన్న గని

 శాన పెద్ద బారముంచిండు

జెవ్వరు బాబు..

గదే !తెలంగాణ భాద్దెత.,

 మీతోడనే కల్సుంటరు,

 నీకాడ పైసలున్నయ్,

పంటలున్నయ్,

ఆల్ల తాన గనులున్నయ్…

ఒంటిగొదిలేస్తె

ఆగమైతడన్జెప్పి

సమ్ఝాయించి,

బాద్దెత్ల్నిచ్చిండు

బారం తలకెత్తిండు.

రాజదాని గాడ్కెల్లి

గీడకు మార్పిచ్చిండు

అదేమంటె

 మీదొకే బాసగదంటడు.

అప్పటి కాడ్కెల్లి,

అంతదన్క నిజాము కాడ

వూర్లల్ల పెత్తనం

చలాయించిన్రు జూడు

 గాదొరలు,

రజాకార్లకు అత్తాసు

 పలికిన దొరలు,

 ఆంధ్రోళ్ళొస్తెగిన,

వూర్లల్ల

అమాయక

 తెలంగాన పెజలు

 (ఆల్లకి సదువెందుకని నొక్కి పెట్టిన్రు గడీ దొరలు.)

తమ సెప్పు సేతల్దాటి,

మాటినకుంటరనీ,

ఆల్లను సెప్పులకిందేసి

 నలిపెడి

 అదికారం,

 ఆదిపత్తెం

ఏడ పోతదోనని,

గప్పటి కాడికెల్లి

 తెలంగాన ను

 అడ్డు పెట్టుకొంట

 ఆధిపత్తేనికై పోరు

 జేస్తనే వున్నరు.

 మద్దెగాల కొద్దికాలం

ఆగినట్టన్పించినా

 మల్ల 1969/1970 ల లో

 గీడనే జమాయించిన

పక్క రాష్ట్రపోళ్ళ

మద్దద్దీస్కుంట

మల్ల ఆధిపత్తెప్పోరు

 షురూజేసిన్రు.

 అధికారం చేత్లకొచ్చినంక

 గా వూసె మరిసింన్రు.

గడీల్నేలిన పెబువుల్గూడ

తెలంగాన స్లోగన్లిచ్చి

పీటమెక్కిన్రు గాని

తర్వాత గాయిసయం

 మరిసిన్రు.

 మరాఠీలూ,

మళయాళీలూ,

 మార్వాడీలూ,

మద్రాసీలూ,

 గీ వీళ్ళు

గిప్పటికెళ్ళి కాదు

 నిజామ్ దొర నాటికెల్లి

యే రోటి కాడి

పాటారోటికాడ పాడి

 వాల్ల పబ్బం

 గడుపుకొన్నరు.

 గుజరాతీలు సింధీలు,

 వున్నరు గాని,

 ఎనకాతలకెల్లి ఆటాడిస్తరు.

 పార్సీలున్న గని

 పైసలిచ్చివూకుంటరు.

 ఆల్లెవర్తోటి డేంజర్ లేదు గాని

 నాల్గు మకార్లు !

ఆళ్ళకు తోడు మరో “మా” కారుడు, యీల్లతోటి జర బద్రంగుండాలె. లేకుంటె ఆదిపత్తెప్పోరు అడ్డ దార్ల్తొక్కుతది. జర జాగ్రత్త!

మకర సంక్రమణ కాంతీ !

రచన : నూతక్కి,

తేదీ : 14-01-2009

విరోదినామ సంవత్సరాన

 తెలుగిండ్ల ముంగిళ్ళ

నడయాడ వచ్చిన

మకర సంక్రమణ

కాంతీ ! సంక్రాంతి !

 తెలుగుల మనస్సులు

 మసి బారి పోయి

 వున్నాయమ్మా!

తెలుగుల మనోరధ

చక్రాలు

విభాజనాభావ

 సమ్మెటల విస్త్రుత

దారుణ ప్రహారాల ధాటికి

 విరిగిపోయి ఉన్నాయమ్మా

 నిను స్వాగతించి

 మా ముంగిళ్ళ కు

తోడ్కొని తెచ్చేందుకూ,

వీధి వీధీ త్రిప్పి

తిరిగి నిను సాగనంప

 రాలే మమ్మా !

వీధులన్నిట విద్వేషమనే

 కంటకాలూ క్రోధావేశ భరిత

కందకాలు తప్ప ,

ఎప్పటిలా

పూలు పరిచిన

 రంగవల్లులు లేవు

 నీ పాదాలకు

గాయాలవుతాయి!

నడయాడాలని చూడకు తల్లీ !

మాకోసం ఎలా వచ్చావో !

పాపం ! మరి ఎలా తిరిగి పోతావో ?

 జాగ్రత్త తల్లీ, ఎక్కడ చూసినా

రాస్తారోకోలూ రెయిళ్ళ రోకోలు.

 కారులు ఎలానూ తిరగవు

 బస్సెక్కీ,రైలెక్కీ

 నీగమ్యానికి చేరలేవు

కాల్పులు,లాఠీ చార్జీలు

 బందుల్లో చిక్కుకోకు

బందిఖానాలో

 బందీవైపోతావు.

బందులొద్దు బిడ్డా!

రచన :నూతక్కి,

 తేదీ: 31-12-2009

బందులొద్దు బిడ్డా

నీవు తెస్తనంటె తెయ్యి గని

తెలంగాన తెస్తనంటె తెయ్యి గని …..

కూర లేదు నార లేదు

 పొయ్యికింద నిప్పులేదు

పైకి తేను పైసలేదు,

పనివున్నా పోనీకి లేదు

బందులొద్దు బిడ్డా,నివు

తెస్తనంటె తెయ్యిగని

తెలంగాన తెస్తనంటే తెయ్యిగని

 పనికి పోక పైసరాదు ….

పైసలుండి గూడ నాకు

 పప్పుప్పులు దొరకై గద

ఎన్ని దినాలాయె నేను

 పాని పూరి బండి బెట్టి

ఎన్ని దినాలాయె నా

 బడ్డీకొట్టుకాడికెల్లి

ఎన్ని దినాలాయెనో

నా సెప్పుకుట్టె షాపు దెరిసి

ఎన్ని దినాలాయెనో

పంచరేసె సాపు తెరిసి

నెలకొక్కటి బందెట్టుకొ

అదిభీ ఓ ఆదివారం

 బందులొద్దు బిడ్డా,

నివు తెస్తనంటె తెయ్యిగని

 తెలంగాన నివు తెస్తనంటే తెయ్యిగని

 మా బతుకుల్తో ఆడుకోకు

మా కడుపులతోఆడబోకు

 పిలగాళ్ళ ఇసుక్కూళ్ళుబాయె

సదువులన్ని సంకనాకె

జలుబొచ్చిన జబ్బొచ్చిన

 డాకటర్లు దొరకరాయె

 నీరసంగ జస్తున్నా

 జాలి రాద బిడ్డ నీకు

బందులొద్దు బిడ్డా,

నివు తెస్తనంటె తెయ్యిగని

 తెలంగాన నివు తెస్తనంటే తెయ్యిగని

 మా బాగోగులు సూడకుంట

 గిట్లనే నువు జేసుకుంట

దిన దినాం బందంట

 మా కడుపుకింత కూడులేక

సస్తున్నాం సూడు బిడ్డ…

బందులొద్దు బిడ్డా,

నివు తెస్తనంటె తెయ్యిగని

తెలంగాన నివు

 తెస్తనంటే తెయ్యిగని

సమాజపు ఓ చీకటి కోణం

రచన: నూతక్కి

 తెదీ: 12-10-2009

వెదుకుతూనే వున్నా

అనునిత్యం వెంపర్లాడుతూ

అంధకారభూయిష్ట సమాజపు

 చీకటి కోణాలను

 మానవతా వీక్షణా కాంతులలో

 ఓ కోణంలో గాంచిన ద్రుశ్యం…

పుట్టెడు పిల్లల కడుపులకై

 పిడికెడు మెతుకులైన

పెడదామని కడుపు కోత భరిస్తూ..

.సోకిస్తూ తన కన్నపిల్లనమ్మేందుకు

 సిద్ధపడిందా బిచ్చగత్తె

పుట్టెడు ధుఃఖంతో……

తప్పుచేసిందని జెయిలుపాలు

 అనాధలైన బిడ్డలు.. .

అయోమయంలో అడుక్కు తింటూ..

తిట్లూ చీత్కారాలూ,

 తన్నులూ తాపులూ కూడా తింటూ….

నాధులమేమున్నామని

వచ్చిన నేరస్తుల చేతుల్లో

 నేరగాళ్ళుగా మారుతున్నబిడ్డలు……

 

 ( ప్రభుత్వాలు కొన్నినైతిక సూత్రాలకు

కట్టుబడి నేరస్తులని భావించి ఎవరినైనా,

 అరెస్ట్ చేసినప్పుడు,ఆ నేరం వెనుక ఆర్ధిక

 కోణాలు అన్వేషించాలి.

వారి కుటుంబ సభ్యులు రోడ్డున పడకుండా

వారి యోగ క్షేమాల భాద్యత ప్రభుత్వమే

తీసుకొని మంచి పౌరులుగా తీర్చిదిద్ది

బ్రతుకు మార్గం నిర్దేసించే కార్యక్రమం

 చేపట్టాలి లేకుంటే క్రొత్త నేరస్తులను

 తయారుచేసే చీకటి మూకలు వారిని

ఆకట్టుకొనేందుకు ఎల్ల వేళలా కాచుకునుంటాయ్

రక్కసి మూకల రాజ్యంలో:….రచయిత)