సహకార సంఘాలతో నాకున్న పరిచయాలు.
రచన:నూతక్కి రాఘవేంద్ర రావు
సం : 1976
నేను నా స్వంత డబ్బులతో , నా స్వంత వుత్సాహంతో స్థాపించి, కార్మికులను ఒప్పించి ,సభ్యులుగా చేర్పించి, ప్రాధమిక సభ్యుల సభ్యత్వ రుసుము నేనే చెల్లించి,సమస్తను రిజిస్టరు చేసి ,కొన్ని సంవత్సరాలు కాపాడి , పాలక వర్గాన్నిగౌరవ సభ్యుల అనుమతితో సక్రమమైన నియమ నిబంధనలు ,పాలనా పధతులు ,విధి విధానాలు, ఏర్పరచి ,పాలక మండలిని నియమింప జేసి సగౌరవంగా తప్పుకున్న ,ఆ సంస్త నా మనో జనిత పుత్రిక. అది ఒక పొదుపు మరియు పరపతి సంస్త.
ఆరోజుల్లో మేము వుద్యోగం చేసే సంస్త కార్మికుల , జీత భత్యాలు చాల తక్కువ వుండేవి. ప్రభుత్వ వుద్యోగం వచ్చే సరకి ,ఒక్క సారిగా కుటుంబ భాద్యతలు మీద పడేవి. చేల్లిళ్ళ పెళ్ళిళ్ళు వగైరా. అప్పులు చేస్తుండేవారు. అలా భవిస్య త్తును నమ్ముకుంటూ దానినే అమ్ముకొనేవారు. అప్పులు చేస్తే భవిష్యత్తులోనేగా తీర్చాలి. ఆ విధంగా భవిష్యత్తు అమ్ముకొనే దిశలో, అప్పుల వ్యాపారం చేసే వాళ్ళు వచ్చి అప్పిచ్చే వారు. వాళ్ళు ఒంద రూపాయలు అప్పు తీసుకుంటే పది రూపాయలు నెల వడ్డీ తగ్గించి తొంభై రూపాయలు ఇచ్చే వారు నోటు మాత్రం వంద రూపాయలకు తీసు కునే వాళ్ళు .నెల నేలా పది రూపాయలు వడ్డీ మాత్రం కడుతూ, అసలు మాత్రం పది రూపాయలు కట్టాలి .అలా పది నెలలు చెల్లించాలి. ఏ నెలయినా నెల కిస్తు కట్ట లేక పోయినా, వడ్డీ కట్టలేకపోయినా ఆ యిరవై రూపాయలకు మరో ఇరవై రూపాయలు పెనాలిటి కట్టాలి. వీడి కొచ్చ్చే జీతంలో అప్పుల కిస్తులే కడతాడా, వడ్డీ ఏ కడతాడా ,ఇంట్లోనే యిస్తాడా. ?ఈ వూబి నుంచి బయట పడటానికి మరి కొన్ని అప్పులు చేసే వాళ్ళు. అప్పుల వాళ్ళు కంపనీ గేటు దగ్గరకు వచ్చి కూర్చునే వాళ్ళు. వాళ్ళను తప్పిన్చుకొనేందుకు వీళ్ళు వుద్యోగానికి వచ్చే వారు కాదు.
ఈ అప్పుల వ్యూహం లో చిక్కు కున్న వా రు లోపల సహోద్యోగుల వద్ద కూడా అప్పులు చేసే వారు.
ఆ సమ యములో కార్మికుల సమస్యలపై నేతృత్వ భాద్యతలలో పాలుపంచుకొంటున్న నాకు అనిపించింది. వీళ్ళ కొఱకు ఏదయినా చేసి వారందరినీ ఆ అప్పుల వూబి నుంచి బయట పడెయ్యాలని.ఆ సంకల్పంతో , సోదర కార్మికులతో సంప్రదించి ఒక పరపతి సంఘం స్తాపించే దిశగా ఒప్పించి, అప్పటికే నేను సేకరించిన సమాచారం ,సంఘ స్థాపనకై చేపట్ట వలసిన చర్యలు వివరించి ,వారికి ఒక విజ్ఞప్తి చేసాను. సంఘం స్తాపనకయ్యే కర్చు, రిజిస్ట్రేషన్ కు ,కావలిసిన కనీస సభ్యులు చెల్లించ వలసిన కనీస రుసుము కూడా నేనే చెల్లిస్తానని చెబుతూ , ఈ అప్పుల ఊబిలో చిక్కుకున్న వారి విషయాలు చెప్పి వారిని ఈ వూబినుంచి వెంటనే బయట పడేసేందుకు అందరూ వారి వారి శక్తిని బట్టి కొంత మొత్తాలు సోసై టీ లో జమ చేస్తే అప్పులిచ్చిన వారిని పిలిపించి అప్పులు తీసు కున్న వారితో ముందే మాట్లాడి వాళ్ళ అప్పులన్నీ చెల్లించి ,వారికి సొసైటీ ద్వారా మొదటి లోనులు ఇప్పించే ఏర్పాటు చేసి తద్వారా వచ్చిన మొత్తంతో మేము యిచ్చిన మొత్తాలు వెనక్కు తీసుకునే విధంగా ను, సొసైటీకి నెల నేలా వడ్డీతో కూడిన కిస్తులు కట్టే ఏర్పాటు చేద్దామని ఒప్పించ గల్గాను.
వారందరి దగ్గరా డబ్బు తీసుకోవడం, అప్పుల బాధితుల్ని ,అప్పుల వాళ్ళనుండి బయట పడేయడం , వాళ్ళు డ్యూటీ లకు సరిగ్గా రావడం ప్రారంభిచడం, చక చకా జరిగి పోయింది. సహకార భావన ఒకరికొకరు సహకరించుకోవడమే కదా.ఈ లోగా కంపనీ యాజమాన్యాన్ని కలసి ,సొసయిటీ , కార్యక్రమాలు వివరించి సహకరించ వలసిందిగా కోరి , సభ్యుల జీతాలనుండి నెల వారీ బకాయిలు మినహాయించి సొసైటీకి చెల్లించేలా అంగీకరింప చేసి,ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సొసైటీ నిబంధనలు (బై లాస్)తయారు చేసి , సొసైటీ నమోదు చేయించి ,కార్మికుల ముందు జెనరల్ బాడీ లో పెడితే, గొప్ప స్పందన వచ్చి సభ్యుల సంఖ్య చాలా పెరిగి పోయింది. ఆ తరువాత
సొసైటీ ని సరైన బాటలో పెట్టె దాక అడహాక్ కమిటీలో వుండి, ఎన్నికలు ప్రకటించి ఎన్నికలు నిర్వహించి కొత్త డైరెక్టర్ల కమిటీ కి అధికారాలు, భాద్యతలు ….అప్పగించినప్పుడు , వారికి నేను జాగ్రత్తలు చెబుతుంటే, మా వుద్యోగ సంస్త MD గారు అన్నారూ ,వేదిక ముందున్న మా తోటి సహోదరులతో ….ఈయన చూడండి స్వంత కూతురిని పెళ్లి చేసి అల్లుడికి అప్పగింతలు చేస్తున్న ట్లుంది కదూ. యిది ఆయన మానస పుత్రిక.కాపాడవలసిన భాద్యత మీరన్దరిదీ. అదే ఆయనకు మీరిచ్చే గౌరవం అన్నప్పుడు, జీవితంలో యింత కంటే నాకింకేమి కావాలి . జీవితంలో యిట్లాంటి పలు కార్యక్రమాలు చేపట్టి సఫలీక్రుతుడనయ్యినా మరో కొన్ని సొసైటీలు స్థాపించి నిర్వహించి నా,ఈ సంస్త నా జీవితానికోఒక గొప్ప అనుభవం.
ఆ సంస్త పేరు బయట పెట్టాలంటే వారి అనుమతి పొంద వలసి వుంటుంది , కనుక ఇప్పడు అది సాధ్య పడదు. అందుకే ఈ పరపతి సంఘం పేరు చెప్పలేదు. అన్యదా భావించ వలదు.
ఇప్పుడు ఆ సంస్త కోట్ల ట ర్నోవర్తో , 5౦౦౦ ల కు పయిగా సభ్యులకు వుపయోగాపడుతూ,
మధ్య మధ్య వేరు పురుగులు చేరి ఇబ్బందులకు గురయినా కూడా ,తట్టుకొని ఆరోగ్యాన్ని పుంజుకొని ఈ రోజు ఆంద్ర ప్రదేశ్ లో మొదటి కొద్ది వాటిలో ఒకటిగా పేరు తెచ్చుకొని దిగ్విజయంగా సాగుతున్నందుకు ,నిర్వాహకుల నిజాయితీ కి సంకల్పానికి ,అంకిత భావానికి నా హృదయ పూర్వక జేజేలు. నాకు కావలిసింది అంతకంటే ఏమున్నది.
(సహకార వుద్యమం పై ఆ కాలంలో వ్రాసి ప్రచురితమయిన నా వ్యాసం ‘జీవితకాలం తృప్తిగా జీవిద్దాం’. తో త్వరలో మీ ముందుకు.) రచన :నూతక్కి రాఘవేంద్ర రావు.తేది:25-౦౪-2009