పిల్లల తల్లి

రచన :నూతక్కి రాఘవేంద్ర రావు.

 తేది:20-07-2009

క్కో క్కో క్కో ..క్కో క్కో క్క్కో …

 భీతితో ఆకసం వంక

బిత్తర చూపులు చూస్తూ

 ఈకలు నిక్కబొడిచి

రెక్కలు బుట్టలా చేసి

గుండ్రంగా తిరుగుతూ కోడి పెట్ట ,

అదనుకోసం ఎదురుచూసి

 వేగంగా వేట కొఱకు

 నింగి నుంచి దూసుకోస్తూ డేగ ,

తల్లి కోడి సంకేతం

 అందుకున్న పిల్లలన్ని

రయ్యిన దూసుకొచ్చి

 తల్లి రెక్కల క్రింద భద్రంగా ….

 ఆఆఅహ్! భలే చాన్సు పోయిందే !!

సిటి లో కూడా తెలివిమీరి పోతున్నాయ్ …

గొణుక్కుంటూ కాంపౌండు వాలుకు

 తట్టుకోబోయి తప్పించుకు ఎగిరిపోతూ డేగ,

వేచి చూసి ఎదురు చూసి

 అవకాశం పోతెపోనిమ్మని

నక్కి నక్కి పెరుగు తాగి

 మీసం తుడుచుకుంటూ

 ఏమీ ఎరగనట్లు దాలి గుంట వేడిలో

 తన్మయతన గండు పిల్లి.

 చాన్సు కోసం చూసి చూసి

వేసారిన మాలకాకి

 దొంగ దొంగ చూపులతో

దోర జామ కాయ కొరికి క్రింద పడవేస్తూ ….

తల్లి కోడి కప్పిన

రెక్కల రక్షణ కవచం నుంచి

తొంగి తొంగి పైకి చూస్తూ

బిత్తరి చూపులతో

ముద్దు ముద్దుగా పిల్లలు