నువ్వే చెప్పు !
రచన : నూతక్కి రాఘవేంద్ర రావు.

అక్షరాలు
నా సృష్టి కాదు
పద
భావాక్షర
సంకలనం
నే చేయలేదు

మరి

నా
వ్యక్తీకరణలు
నారాతలు
నాభావ వేదనలు
నా అక్షర భావపద
సంకలనాలు
చౌర్యం కాదా ?
నానేరంకాదా ?

మరి

నేనెలా చెప్పుకోను
ఈకవిత నాదేనని
రచించిందినేనని

ఈ భావం ఈ భాష
ఈ పదాలు
అక్షరాల కూర్పుల్లో
క్రమ విధాన భంగిమలూ
కనిపెట్టింది నేను కాదె

అక్షరం నేను కనిపెట్టలేదుగా
నాకన్నా ముందునుండి ఉందిగా
అక్షరాలు, గుది గుచ్చిన పదాలు
పదబంధ మాలికలా వాక్యాలూ
నేను సృష్టించినవి కావే!

నేను పుట్టేసరికే జనుల పెదవుల
నాట్యం చేస్తున్నవే కదా
భావాలు మనోజనిత వుత్ప్రేరితాలు
అన్నీ అప్పటికే బహిరంగ
వ్యక్తీకరణ లే గా!

మరి నాకుగా నేను ఈ భాషలో
భావంలో భాష్యంలో
సృజియించినదేముందని
వారూ వీరూ వేడి వేడిగా వాడుకొని
వాడి వాడి వదిలేసిన
వడి తగ్గిన
పదాలనటూయిటూ
కూరుస్తూ ఏదేదో గిలికేస్తూ
పలుమారులు మారుస్తూ
కాకెంగిలి చేస్తూ
కవితనై కురుస్తూ
భావాలను వర్షిస్తున్నానని
మది లోలోతుల కులుకుతున్నా

నా మదిలో తిరుగాడే
వ్యధలను వెలిగ్రక్కాననుకొని
నా భుజం నేనే తట్టుకొని
శహభాష్ అనుకొని ….
అయినా ….
నేనెలా చెప్పుకోను చెప్పు……
ఈ కవితనై నేనే పలికానని
………………………………………………